- మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లో ఘటన
- వక్ఫ్ ఆస్తుల వివాదమే కారణమని అనుమానం
- ఓ కాలేజీ యాజమాన్యంపై మృతుడి కొడుకు ఆరోపణలు
- మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లో ఘటన
మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్‌లో శనివారం తెల్లవారుజామున ఓ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. పక్కా స్కెచ్‌తో కారుతో ఢీకొట్టి హతమార్చారు. మాసబ్ ట్యాంక్ శాంతినగర్ ప్రాంతానికి చెందిన ఖాజా మొహిజుద్దీన్ (63) వృత్తిరీత్యా అడ్వకేట్. తన మామ హాస్పిటల్లో ఉండడంతో శనివారం ఉదయం ఆయనను చూసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చి.. రోడ్డుపై పార్క్ చేసిన తన కారు డోర్ తీస్తుండగా.. నంబర్ ప్లేట్ లేని ఒక కారు వేగంగా దూసుకొచ్చి ఆయనను బలంగా ఢీకొట్టింది.
దీంతో మొహిజుద్దీన్ ఎగిరి కొంతదూరంలో పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సదరు కారులోని దుండగులు వాహనంతో సహా అక్కడి నుంచి వేగంగా పారిపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఖాజా మొహిజుద్దీన్‌ను కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందారు.
వక్ఫ్ ఆస్తుల వివాదమే కారణం?
ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖాజా మొహిజుద్దీన్ వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడేందుకు కోర్టులో కొన్ని కేసుల తరఫున వాదిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఒక కాలేజీ యాజమాన్యం వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆక్రమించిన విషయంలో.. సదరు యాజమాన్యానికి వ్యతిరేకంగా కోర్టులో గట్టిగా వాదిస్తున్నారని హత్యకు గురైన ఖాజా కొడుకు ఫర్హాన్ తెలిపారు.
తన తండ్రిని అన్వర్ ఉలూమ్ కాలేజీ యాజమాన్యం ఆలం ఖాన్ వారే హత్య చేయించినట్టు ఆరోపించారు. గతంలో ఆరుసార్లు తన తండ్రిపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా హిమాయత్‌నగర్‌లోని తన ఆఫీసుకు ముజాహిద్ ఆలం ఖాన్ అనే వ్యక్తి వచ్చి, రెండు కోట్లు ఇస్తాను కేసు నుంచి తప్పుకోమన్నారని, ఆ డబ్బులు తీసుకుని దుబాయ్ లేదా ఇంకా ఎక్కడికైనా వెళ్లిపోవాలని సలహా కూడా ఇచ్చాడని తెలిపారు.
ఈ కేసు నుంచి తప్పుకోకుంటే తన తండ్రిని చంపుతామని బెదిరించారని ఫర్హాన్ ఆరోపించారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఏం జరిగినా ఆలం ఖాన్‌దే బాధ్యతని, ఆలం ఖాన్ నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు బెంగళూరుకు వెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
హైకోర్టు బార్ అసోసియేషన్ ఖండన..
అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ హత్యను రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వంతో పాటు పోలీసులను కోరుతూ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను అరెస్టు చేయాలని డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌ను కోరింది. ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరఫున రాష్ట్రంలోని న్యాయవాదులు ఎవరూ హాజరు కాకూడదని ‘అడ్వకేట్స్ ఫర్ జస్టిస్’ సంస్థ విజ్ఞప్తి చేసింది. న్యాయవాదిపై దాడి చేయడం అంటే.. న్యాయవృత్తి స్వాతంత్ర్యంపై దాడి చేసినట్టేనని పేర్కొంది.
