IRFCతో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ మెట్రోకు రూ. 13 వేల 600 కోట్లు రీఫైనాన్సింగ్ చేసేందుకు గాను ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు ఐఆర్‌ఎఫ్‌సీ సీఎండీ మనోజ్ కుమార్ దూబే, తెలంగాణ సీఎస్ కె. రామకృష్ణ రావు సమక్షంలో సోమవారం ( మే 25 ) న్యూ ఢిల్లీలో ఒప్పందంపై సంతకాలు చేశారు.
హైదరాబాద్ మెట్రోకు దీర్ఘకాలిక ఆర్థిక బలం చేకూర్చే దిశగా ఈ కీలక ఒప్పందం జరిగిందని.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు సీఎస్ రామకృష్ణ రావు. హైదరాబాద్ దేశ ఆర్థిక వృద్ధికి కీలక ఇంజిన్‌గా ఎదుగుతోందని.. మెట్రో కనెక్టివిటీ బలోపేతంతో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయని అన్నారు.
ప్రస్తుతం ఉన్న రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు రూ.13 వేల 600 కోట్ల రుణం మంజూరు చేసి.. నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్‌కు నిధులను వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందంతో హైదరాబాద్ మెట్రోకు 20 ఏళ్ల కాలపరిమితితో త్రైమాసిక చెల్లింపుల పద్ధతిలో రుణ సౌకర్యం లభించనుంది. హైదరాబాద్ మెట్రోకు ఆర్థిక భారం తగ్గించేందుకు రీఫైనాన్సింగ్ దోహదపడుతుందని అన్నారు.
మెట్రో భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు కూడా ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని.. హైదరాబాద్ మెట్రో 100 శాతం యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ అయ్యిందని అన్నారు.హైదరాబాద్ మెట్రో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని కీలక ప్రజా రవాణా ఆస్తిగా మారనుందని అన్నారు.ఈ క్రమంలో భారత ప్రభుత్వం, ఐఆర్‌ఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్‌ఎల్ బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు సీఎస్ రామకృష్ణ రావు. హైదరాబాద్‌కు సమర్థవంతమైన, సుస్థిరమైన ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
