స్టూడెంట్స్ స్పెషల్ : నెక్లెస్‌ రోడ్‌లో సైన్స్‌ పార్క్‌

స్టూడెంట్స్ స్పెషల్ : నెక్లెస్‌ రోడ్‌లో సైన్స్‌ పార్క్‌

హైదరాబాద్‌‌, వెలుగు: నెక్లెస్‌‌ రోడ్‌‌లో ‘డూ సైన్స్‌‌’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన సైన్స్‌‌ పార్క్‌‌ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తొలుత గతేడాది ఆగస్టులో సంజీవయ్య పార్కులో ‘డూ సైన్స్‌‌’ పార్క్‌‌ను ఏర్పాటు చేశారు. బుక్‌‌ మార్క్‌‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు కల్పన విశ్వనాథం ఈ పార్క్‌‌ను ఏర్పాటు చేశారు. తరగతి గదిలో చిన్నారులు నేర్చుకున్న సైన్స్‌‌ పాఠాలను ఈ పార్క్‌‌లో  ప్రయోగాత్మకంగా వివరిస్తారు. ఇందుకు  సంబంధించిన 45 ఎగ్జిబిట్స్‌‌ను పార్క్‌‌లో ఏర్పాటు చేశారు.  సంజీవయ్య పార్కులో సైన్స్‌‌ పార్క్‌‌ ఏర్పాటు చేసిన సమయంలో 20 ఎగ్జిబిట్లతో పార్క్‌‌ను ప్రారంభించారు. 2018  ఆగస్టులో  ఐదు వేల చదరపు అడుగుల స్థలంలో సంజీవయ్య పార్కులో సైన్స్‌‌ పార్క్‌‌ ఏర్పాటుచేసిన కల్పన… అక్కడ ఆదరణ సరిగా లేకపోవడంతో నెక్లెస్‌‌ రోడ్‌‌ రైల్వే స్టేషన్‌‌ సమీపంలో హెచ్‌‌ఎండీఏ స్థలంలోకి పార్క్‌‌ను మార్చారు. ఐదు సంవత్సరాల కోసం హెచ్‌‌ఎండీఏ నుంచి ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. పదివేల చదరపు అడుగుల స్థలంలో 45 ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తున్నారు. విద్యా వ్యవస్థ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది.ఈ విద్యా వ్యవస్థలో మనం ఏం చేయవచ్చని ఆలోచించిన కల్పన సైన్స్‌‌ పార్క్‌‌ ఏర్పాటుకు ముందుకొచ్చారు. పాఠశాలలో పాఠాలు చెప్పే విధానానికి, పార్క్‌‌లో ఎగ్జిబిట్లతో చేసిన ప్రయోగానికి చాలా తేడా ఉంటుందని, విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని కల్పన తెలిపారు.

ఇందుకోసం ఇంజినీర్లు, ఎంబీఏ పూర్తి చేసిన వారు, విద్యారంగ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని ఈ సైన్స్‌‌ పార్క్‌‌ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఫిజిక్స్‌‌ ఎగ్జిబిట్లతో పార్క్‌‌ను ప్రారంభించారు. మెకానిక్‌‌ సౌండ్‌‌ అండ్‌‌ లైట్, పజిల్స్‌‌, సింపుల్‌‌ మెషీన్స్‌‌ తదితర ఎగ్జిబిట్లను ఏర్పాటుచేశారు. ఎగ్జిబిట్ల సంఖ్యను క్రమంగా పెంచే ఆలోచన ఉందని కల్పన చెప్పారు. గణితంలో పైథాగరస్‌‌ సిద్ధాంతం, ఇతర సిద్ధాంతాలను ప్రవేశపెడతామన్నారు. సొంత డబ్బులతోనే పార్క్‌‌ను నిర్వహిస్తున్నామని, ఎవరైనా ఆర్థికసాయం అందిస్తే బావుంటుందని తెలిపారు. తమకు ఐడియాస్‌‌ ఉన్నాయని… ఒక స్పష్టమైన విజన్‌‌ ఉందని… కానీ ఫండ్‌‌ సపోర్టింగ్‌‌ లభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సైన్స్‌‌ పార్క్‌‌కు స్పందన బాగుందని, నగరంతోపాటు శివారు ప్రాంతాల నుంచి వివిధ పాఠశాలల విద్యార్థులు సైన్స్‌‌ పార్క్‌‌ను సందర్శించేందుకు తరలి వస్తున్నారని చెప్పారు. వారాంతాల్లో కొందరు కుటుంబాలతో సహా తరలి వస్తున్నారని వివరించారు. పాఠశాలలు ప్రారంభమయ్యాక ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు పెద్దసంఖ్యలో పాఠశాలల విద్యార్థులు తరలివస్తారని తెలిపారు