- ఒకరు మృతి, 16 మందికి అస్వస్థత
- చికెన్, ఫిష్, రోటీలు వండుకొని లిక్కర్‌తో పార్టీ
- ఎక్స్పైరీ వస్తువులు వాడటంతో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు అనుమానాలు
జీడిమెట్ల, వెలుగు: న్యూ ఇయర్ పార్టీలో ఫుడ్ పాయిజన్ జరిగి ఒకరు చనిపోయారు. మరో 16 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధిలోని 17 మంది భవానీ నగర్ అసోసియేషన్ సభ్యులు, మరికొంత మంది కలిసి న్యూ ఇయర్ సందర్భంగా బుధవారం సాయంత్రం ఒక్కొక్కరు రూ.500 వేసుకుని పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా చికెన్, ఫిష్, రోటీలు స్వయంగా వండుకొని కమ్యూనిటీ హాల్లో మందుతో పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి వరకూ పార్టీ కొనసాగింది.
అప్పటికే కొంత మందికి ఇబ్బందిగా ఉండటంతో ఇంటికి వెళ్లిపోయారు. పార్టీ చేసుకున్న వెంగల పాండు (53) గురువారం ఇంట్లోనే మృతి చెందాడు. మిగిలినవారు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని కుటుంబసభ్యులు సూరారంలోని హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను బాలానగర్ ఏసీపీ నరేశ్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మల్లారెడ్డి హాస్పిటల్లో మొత్తం 9 మంది, రామ్‌దేవ్ హాస్పిటల్లో ఇద్దరు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
మిగిలిన వారి గురించి సమాచారం లేదన్నారు. ‘‘పార్టీ చేసుకున్నవారిలో పాండు అనే వ్యక్తి చనిపోయాడు. వెంకటనర్సయ్య అనే వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రాథమిక సమాచారం ఆధారంగా ఫుడ్ పాయిజన్ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నాం. వంటకు ఎక్స్పైరీ మెటీరియల్ వాడినట్లు తెలుస్తున్నది. వండుకున్న ఫుడ్‌ను సీజ్ చేసి ల్యాబ్‌కు పంపినం’’అని ఏసీపీ నరేశ్ రెడ్డి తెలిపారు. ఫుడ్ వల్ల ఇలా జరిగిందా? లేదంటే కల్తీ మందు తాగడంతో అస్వస్థతకు గురయ్యారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
