
హైదరాబాద్, వెలుగు : ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్‌లో హైదరాబాద్ కు చెందిన బోరోలెక్స్ ఇండస్ట్రీస్ అనే ఇంజినీరింగ్ సంస్థ కీలక పాత్ర పోషించింది. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అమెరికా ఆగర్ యంత్రం చివరి దశలో మొరాయించింది. దాని ప్లేట్లు విరిగిపోవడంతో రెస్క్యూ పనులు నిలిచిపోయాయి. దాంతో రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న సీనియర్ అధికారులు ఈ నెల 25న హైదరాబాద్‌లోని డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డిని సంప్రదించారు.
ఆయన సూచన మేరకు హైదరాబాద్ బోరోలెక్స్ ఇండస్ట్రీస్ ఇంజినీరింగ్ సంస్థ రెస్క్యూ ఆపరేషన్‌లోకి ఎంటర్ అయ్యింది. 800 మి.మీ. కంటే చిన్న పైప్‌లైన్ వ్యాసం కలిగిన రెండు యంత్రాలను, ఇద్దరు కట్టింగ్ ఎక్స్ పర్ట్స్ ను ప్రత్యేక విమానంలో ఘటనాస్థలికి తరలించారు. 25న బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి డెహ్రాడూన్ చేరుకున్న వారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో టన్నెల్ వద్దకు చేరుకున్నారు. చేరుకున్న కొద్ది గంటలకే సొరంగంలో అడ్డుగా ఉన్న అగర్ మిషన్ బ్లేడ్లను కోసే పనిని ప్రారంభించారు.
అతి తక్కువ సమయంలో డ్రిల్లింగ్కు అనువైన పరిస్థితులు కల్పించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. బోరోలెక్స్ ఇండస్ట్రీస్ వేగంగా స్పందించడం వల్లే రెస్క్యూ ఆపరేషన్ త్వరగా ముగిసిందని..41 మంది సురక్షితంగా బయటకొచ్చారని ఉత్తరాఖండ్ ఉన్నతాధికా రులు వెల్లడించారు. బోరోలెక్స్ ఇండస్ట్రీస్‌కు థ్యాంక్స్ చెప్పారు. టన్నెల్ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన ఇండస్ట్రీస్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.