మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని నెత్తీనోరూ బాదుకుని చెప్పినా మద్యం ప్రియలు మాత్రం ‘మందేస్తూ చిందెయ్ రా.. చిందేస్తూ మందెయ్ రా’ అని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. ఒక సంవత్సరం పాటు డైలీ మద్యం తాగితే.. మందు బాబులకు యమా డేంజర్ అని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి కాలేయం (లివర్). ఇది జీర్ణవ్యవస్థతో మంచి అనుబంధం కలిగి ఉంటుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా.. జీర్ణమైన ఆహారాన్ని శరీరానికి అందేలా సమన్వయం చేస్తుంది లివర్.
డైలీ మందు తాగితే అసిటాల్డిహైడ్ అనే విషపూరిత ఉప ఉత్పత్తి శరీరంలో ఏర్పడుతుంది. ఇది శరీరంలోని కాలేయ కణాలను దెబ్బతీసి, కాలేయ వాపుకు కారణం అవుతుంది. కాలేయం పనితీరు బలహీనం అవుతుంది. ఈ అవయవం స్పష్టమైన ముందస్తు హెచ్చరిక సంకేతాలను పంపదు. అందువల్ల.. మీకు తెలియకుండానే ఈ నష్టం జరిగిపోతుంది. కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోతుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అంటారు. లక్షణాలు కనిపించే ఛాన్స్ లేకపోవడంతో లైట్ తీసుకుంటారు.
►ALSO READ | దగ్గు, ఆయాసం తగ్గడం లేదా ? అయితే జాగ్రత్త! ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి..
మద్యం కేవలం కాలేయ పనితీరును మాత్రమే ప్రభావితం చేయదు. ఇది కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలను కూడా పెంచుతుంది, ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. డైలీ మద్యం సేవించడం వల్ల కాలేయ క్యాన్సర్ వస్తుంది. అంతేకాకుండా, మద్యం హార్మోన్లను, ముఖ్యంగా ఈస్ట్రోజెన్‌ను ప్రభావితం చేసి, రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. రోజుకు ఒక్క పెగ్గు తాగినా కూడా ఈ ప్రమాదం సుమారు 7 నుండి 10 శాతం వరకు పెరగవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
