దీర్ఘకాలిక దగ్గు లేదా శ్వాస సమస్యలను నిర్లక్ష్యం చేయడం ప్రాణాలకే ముప్పు చేయవచ్చు. కాలుష్యం, మారుతున్న అలవాట్లు, కోవిడ్ ప్రభావం వల్ల నేడు ఊపిరితిత్తుల వ్యాధులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కనిపించే సమస్యలు ఆస్తమా ఇంకా COPD. ఊపిరి పీల్చుకోవడం కష్టమవ్వడం, ఆయాసం, గొంతులో గురక రావడం వీటి ముఖ్య లక్షణాలు. వాయు కాలుష్యం వల్ల ఇవి ఎక్కువగా వస్తున్నాయి.
ఊపిరితిత్తుల వాపు : ఊపిరితిత్తుల లోపల వాపు రావడం లేదా మచ్చలు ఏర్పడటం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్: ఇది చాలా ప్రమాదకరమైనది. దీనిని ఎంత త్వరగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.
ఇన్ఫెక్షన్లు: కోవిడ్ తర్వాత చాలామందిలో న్యుమోనియా, క్షయ (TB), ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి.
ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి
మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించండి:
*చాలా కాలంగా దగ్గు వస్తూ, ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే.
*చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు కూడా ఆయాసంగా అనిపిస్తే.
* శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీలో ఈల వేసినట్లు శబ్దం రావడం.
*మాటిమాటికీ జలుబు, దగ్గు లేదా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు రావడం.
*ఛాతీలో బరువుగా ఉండటం, విపరీతమైన అలసట కలగడం.
* దగ్గినప్పుడు వచ్చే శ్లేష్మం (కఫమ్)లో రక్తం పడటం చాలా తీవ్రమైన సంకేతం.
మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చిట్కాలు
*సిగరెట్లు, బీడీలు లేదా వేపింగ్ (Vaping) ఊపిరితిత్తులకు శాశ్వత నష్టం కలిగిస్తాయి. వీటిని మానేయడానికి అవసరమైతే వైద్యుల సాయం తీసుకోండి.
*గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకండి. వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించండి. ఇంట్లో గాలి ఆడేలా/ వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఉపయోగించండి.
►ALSO READ | ఎండల వల్ల కోపం, చిరాకు ఎందుకు పెరుగుతుందో తెలుసా ? కారణం ఇదిగో..
*రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా లేదా వ్యాయామం, ఈత కొట్టడం చేయండి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది.
*బెర్రీ పండ్లు, జామకాయలు, ఆకుకూరలు వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తీసుకోండి. ఇవి ఊపిరితిత్తులలో వాపును తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
