వేసవి ఎండలు కేవలం చెమటనే కాదు, కోపాన్ని కూడా పెంచుతుంది. ఎండలు పెరిగినప్పుడు మన శరీరంలో వచ్చే మార్పులు మన మెదడుపై ప్రభావం చూపుతాయి. పగటిపూట ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్నప్పుడు లేదా చిన్న చిన్న విషయాలకే ప్రజలు ఎందుకు అంత ఎక్కువగా కోపానికి గురవుతారో మీరు ఎప్పుడైనా గమనించారా? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
బయట వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, మన శరీరం దానికంతట అదే చల్లబరుచుకోవడానికి చాలా కష్టపడుతుంది. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, విపరీతమైన చెమట పట్టడం జరుగుతుంది. ఈ శారీరక అలసట వల్ల మనకు తెలియకుండానే చిరాకు వస్తుంది.
ALSO READ : ఈ రాశుల వారు చాలా సున్నితంగా ఉంటారు..
చెమట ద్వారా ఒంట్లోని నీరు, లవణాలు బయటకు పోతాయి. నీరు తగ్గినప్పుడు తలనొప్పి, అలసట వస్తాయి. మెదడుకు సరిపడా నీరు అందకపోతే ఏకాగ్రత తగ్గి, చిన్న విషయాలకే కోపం వస్తుంది.
ఒకోసారి వేసవి కాలంలో రాత్రులు వేడిగా ఉండటం వల్ల సరిగ్గా నిద్ర పట్టదు. నిద్ర సరిపోకపోతే మెదడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేదు. అందుకే పొద్దున్నే లేవగానే ఏదో తెలియని అసహనం ఉంటుంది.
అంతేకాదు ఎండ వల్ల పిల్లలు ఎక్కువగా మారాం చేస్తారు. వృద్ధులు త్వరగా నీరసపడిపోయి, మానసికంగా అలసిపోయినట్లు కనిపిస్తారు.
మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి చిట్కాలు
*ఈ వేసవిలో ప్రశాంతంగా ఉండడానికి డాక్టర్లు సూచిస్తున్న కొన్ని సులభమైన మార్గాలు:
*రోజూ కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగాలి. కేవలం నీళ్లే కాకుండా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి తాగితే శరీరానికి శక్తి అందుతుంది.
*మసాలాలు ఎక్కువగా ఉండే భోజనం కంటే, తేలికగా అరిగే ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా ఈ సీజన్లో దొరికే పండ్లు, కూరగాయల సలాడ్లు తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.
*టీ, కాఫీలు శరీరంలోని నీటిని తగ్గించేస్తాయి. ఇవి ఆందోళనను కూడా పెంచుతాయి, కాబట్టి వీటిని తాగడం తగ్గించడం మంచిది.
*వీలైనంత వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగడం తగ్గించండి. చాలా అవసరమైతేనే బయటకు వెళ్లండి.
వేసవిలో కోపం రావడం అనేది కేవలం మన ప్రవర్తనకు సంబంధించింది కాదు, అది మన శరీర ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనసును, శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు.
