తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణి కార్తె రానేలేదు అప్పుడే రోకళ్లు పగిలేలా ఎండలు మండుతున్నాయి. చల్లచల్లగా తెలవారుతుందనుకునే పరిస్థితి లేకుండా.. ఉదయం నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎండ తీవ్రత తగ్గటం లేదు.
భానుడి భగభగకు అగ్నిగుండంలా మండుతున్న తెలంగాణ జిల్లాలకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. 2026 మే 05వ తేదీన సాయంత్రం పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తేలికపాటి జల్లులతో వాతావరణం కాస్త చల్లబడుతుందని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జనగాం, కరీంనగర్, కుమరం భీం, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, హన్మకొండ, నాగర్ కర్నూల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రెండుమూడు గంటల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడి వర్షం వచ్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు తెలుస్తున్నాయి.
