కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. లోక్‌భవన్‌కు వెళ్లనని, గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇవ్వనని ఆమె కుండబద్ధలు కొట్టారు. టీఎంసీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోలేదని, తాము గెలిచామని.. తమ ఓట్లను చోరీ చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు.
#WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee says, "I will not resign, I did not lose, I will not go to Raj Bhavan...The question doesn't arise. No. Now, I also want to say that we didn't lose the election. It is their attempt to defeat us. Officially, through the Election… pic.twitter.com/AKKFvQ2gvq
— ANI (@ANI) May 5, 2026
అంతేకాదు.. ఎన్నికల సంఘంపై కూడా మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమ పోరాటం బీజేపీతో కాదని, ఎన్నికల సంఘంతోనని ఆమె చెప్పారు. బీజేపీ ఈసీని ఉపయోగించుకుని ఈ వ్యూహ రచన చేసిందని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రజాస్వామ్యం దారుణ హత్యకు గురైందని బెంగాల్ ఎన్నికల ఫలితాలపై దీదీ తీవ్రంగా స్పందించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
90 లక్షల పేర్లను తొలగించారని, తాము ఈ విషయంపై కోర్టుకు వెళితే, 32 లక్షల పేర్లను పునరుద్ధరించారని ఆమె చెప్పారు. ఆ తర్వాత కూడా.. మరో ఏడు లక్షల పేర్లను చేర్చారని తెలిపారు. తన జీవితంలో ఇలాంటి ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని, 2004 తర్వాత కూడా ఇంతటి అకృత్యాలను చూడలేదని.. ఇది చాలా దారుణమని పశ్చిమ బెంగాల్ ఫలితాలపై మమతా బెనర్జీ ప్రెస్ మీట్లో స్పందించారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 294 సీట్లకు గాను బీజేపీ ఏకంగా 207 స్థానాలు గెలిచి విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన కనీస మెజార్టీ (మ్యాజిక్ ఫిగర్) 148 సీట్లను సునాయాసంగా దాటిన కమలం పార్టీ.. రెండింట మూడొంతుల సీట్ల(196) మార్కును సైతం దాటి కమాల్ చేసింది. మమత నేతృత్వంలోని టీఎంసీ బీజేపీ హవాతో ఈసారి 80 సీట్లకే పరిమితమైపోయింది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 2, ఏజేయూపీ 2, సీపీఎం 1, ఏఐఎస్ఎఫ్ పార్టీ 1 సీటు చొప్పున గెలుచుకున్నాయి. బీజేపీ అత్యధికంగా 45.83% వోట్ షేర్ సాధించగా, టీఎంసీ 40.81% ఓట్లు దక్కించుకుంది.
కాగా, ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది మొదటి దశలో 93.16%, రెండో దశలో 91% పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్త సగటు ఓటింగ్ 92% కంటే ఎక్కువగా నమోదైంది. ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యధిక ఓటింగ్ శాతంగా నిలిచింది. దీంతో రికార్డ్ స్థాయిలో పెరిగిన ఓటింగ్ శాతం బీజేపీకి అనుకూలంగానే ఉంటుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా.. దాదాపుగా అంతకుమించిన ఫలితాలు వచ్చాయి.
►ALSO READ | కడుపులో తన్ని కౌంటింగ్ సెంటర్ నుంచి గెంటేశారు: మమత సంచలన ఆరోపణ
