చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ మే 7న ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసింది. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం వేదికగా అట్టహాసంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుందని సమాచారం.
తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 108 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ టీవీకే పార్టీ విజయ కేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో తమిళనాడులో విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, పీఎంకే, లెఫ్ట్ పార్టీలు, వీసీకే పార్టీల మద్దతుతో విజయ్ సీఎం అవడం ఖాయంగా కనిపిస్తోంది.
విజయ్ సీఎం అవ్వాలంటే ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118. విజయ్ పార్టీ ఈ మ్యాజిక్ ఫిగర్కు 10 స్థానాల దూరంలో నిలిచింది. విజయ్ పార్టీకి మద్దతు తెలిపే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరనే విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాంగ్రెస్ మద్దతుతో అని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇటు కాంగ్రెస్ గానీ, అటు టీవీకే గానీ ఈ విషయాన్ని ధృవీకరించకపోవడం గమనార్హం.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. మొత్తం 234 సీట్లకుగానూ 108 చోట్ల గెలుపొంది.. అధికార పీఠానికి అడుగుదూరంలో నిలిచింది. ఎంజీఆర్ తర్వాత సినీ నటుడు విజయ్నేతృత్వంలోని ఈ పార్టీ.. పెట్టిన రెండేండ్లలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ద్రవిడ రాజకీయాల్లోనే సరికొత్త చరిత్రను సృష్టించింది.
ఎగ్జిట్‌పోల్స్‌ను తలకిందులు చేస్తూ.. ఎన్నికల విశ్లేషకులే ఆశ్చర్యపోయేలా విజయ్దళపతి ప్రభంజనం సృష్టించారు. ఆయన పోటీచేసిన రెండుచోట్ల గెలిచి..రీల్ లైఫ్హీరో నుంచి రియల్ పొలిటికల్ లైఫ్ హీరోగా మారిపోయారు. ప్రజలతో ‘విజిల్’ వేయించి మెజార్టీ స్థానాలు గెలవడం ద్వారా అటు సినిమాల్లోనే కాదు.. ఇటు పాలిటిక్స్‌లోనూ బంపర్ హిట్ కొట్టారు.
టీవీకే ధాటికి దశాబ్దాల సంప్రదాయ ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే రెండో, మూడో స్థానానికి పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు.. సెంటిమెంట్ రాజకీయాలు తమను గెలిపిస్తాయని నమ్మిన అధికార డీఎంకే డిజాస్టర్‌ను మూటగట్టుకోగా.. కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం స్టాలిన్ పరాజయం పాలయ్యారు. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను పక్కకు నెట్టి, నటుడు విజయ్ తొలి ఎన్నికలతోనే కింగ్‌మేకర్‌గా మారడం తమిళ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నది.
