పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల జాతర.. జోన్లవారీగా ఉత్తర్వులు జారీ 

పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల జాతర.. జోన్లవారీగా ఉత్తర్వులు జారీ 
  •     170 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి
  •     మరో 42 మందికి సూపరింటెండెంట్లుగా చాన్స్
  •     జోన్లవారీగా ఉత్తర్వులు జారీ చేసిన పీఆర్, ఆర్డీ కమిషనర్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో భారీగా పదోన్నతుల సందడి నెలకొంది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న జూనియర్, సీనియర్​ అసిస్టెంట్లకు ప్రమోషన్లు లభించాయి. పీఆర్, ఆర్డీ కమిషనర్  డి.దివ్య ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జోన్లలో పనిచేస్తున్న 170 మంది జూనియర్  అసిస్టెంట్లు, టైపిస్టులకు సీనియర్  అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. 

జోన్లవారీగా వివరాలు ఇలా ఉన్నాయి. కాళేశ్వరం (జోన్ 1) 21 మందికి, బాసర (జోన్ 2) 12 మందికి, రాజన్న (జోన్ 3) 48 మందికి, భద్రాద్రి (జోన్ 4) 35 మందికి, యాదాద్రి (జోన్ 5) 28 మందికి, చార్మినార్ జోన్ (జోన్​ 6) 13 మందికి, జోగుళాంబ (జోన్ 7) 13 మందికి సీనియర్​ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు వచ్చాయి.  సీనియర్  అసిస్టెంట్  కేడర్  నుంచి సూపరింటెండెంట్లుగా మొత్తం 42 మందికి పదోన్నతి లభించింది. జోన్లవారీగా చూస్తే.. జోన్-2లో అత్యధికంగా 10 మందికి,  జోన్​5లో 10 మందికి, జోన్-1లో 9 మందికి, జోన్ 3లో 8 మందికి, జోన్ -7లో ఆరుగురికి,  జోన్-6లో ఐదుగురికి, జోన్-4లో నలుగురికి పదోన్నతులు కల్పించారు. 

ఈ పదోన్నతులన్నీ పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన కల్పించినట్లు కమిషనర్  స్పష్టం చేశారు. కోర్టు తీర్పులు, క్రమశిక్షణ చర్యలకు లోబడి ఈ నియామకాలు ఉంటాయని తెలిపారు. ప్రమోషన్  పొందిన అభ్యర్థులు తమకు కేటాయించిన స్థానాల్లో 15 రోజుల్లోపు చేరాలని, లేకపోతే పదోన్నతిని వదులుకున్నట్లుగా పరిగణిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రమోషన్లు రావడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.