కరీంనగర్ జువెలరీ షాప్ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పట్టపగలే నగలను దోచుకెళ్లిన నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులకు వారు వాడిన బైక్ దొరికింది. పల్సర్ బైక్‌ను జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులకు నిందితులు ఆ బైకును అక్కడే వదిలేసి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి.
పోలీసులకు దొరికిన బైక్ కు ఉపయోగించిన నెంబర్ ప్లేటు బలెనో డెల్టా కారుకు సంబంధించింది. హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కారుకు సంబంధించిన నెంబర్ ప్లేట్ ను పల్సర్ వాహనాలకు ఉపయోగించారు. దొంగలు బీర్పూర్ - ధర్మపురి మార్గం గుండా వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులు ధర్మపురి వద్ద గోదావరి నదిని దాటి, మహారాష్ట్ర సరిహద్దు వైపు పారిపోయి ఉండవచ్చని పోలీసులుఅనుమానిస్తున్నారు.
అంతర్రాష్ట్ర ముఠా పనేనా? లేక స్థానికుల ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు వాహనాన్ని మార్చి తప్పించుకున్నారా అనే కోణంలో సరిహద్దు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
మే 3న చోరీ
కరీంనగర్ సిటీలోని పీఎంజే జ్యువెలరీ షాపులో మే 3 న ఆదివారం పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. పిస్టల్స్‌తో వచ్చిన ఐదుగురు దొంగలు.. సిబ్బందిపై కాల్పులు జరిపి సుమారు కిలోన్నరకుపైగా బంగారం ఎత్తుకెళ్లారు. దొంగలు జరిపిన కాల్పుల్లో షాపు సేల్స్ మేనేజర్ ముస్తాక్ అలీతోపాటు సిబ్బంది కమల్, మధుకర్, సెక్యూరిటీ గార్డు రాజేశ్ తీవ్రంగా గాయపడ్డారు. షాపులోకి ఎంటరైన ఐదు నిమిషాల్లోనే పని ముగించుకున్న దొంగలు.. బయటికి పరుగెత్తి పల్సర్, అపాచీ బైక్ లపై పరారయ్యారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు దొంగల కోసం తనిఖీలు ముమ్మరం చేశారు. పారిపోయిన దొంగల సమాచారం ఇచ్చినవాళ్లకు రూ.లక్ష రివార్డును ప్రకటించారు.
