హైదరాబాద్ పాతబస్తీలో హాంకాంగ్ సైబర్ గ్యాంగ్.. చాంద్రాయణ గుట్టలో ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్ పాతబస్తీలో హాంకాంగ్ సైబర్ గ్యాంగ్.. చాంద్రాయణ గుట్టలో ముగ్గురు అరెస్ట్
  • హాంకాంగ్ లేడీ వెనిస్సాను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌, వెలుగు: ఇంటర్నేషనల్‌ కాల్స్​ను ఇండియా కాల్స్​గా మార్చి సైబర్ నేరాలకు పాల్పడుతున్న హాంకాంగ్‌ గ్యాంగ్​ను  గుట్టు రట్టయింది. పాతబస్తీ చాంద్రాయణ గుట్టలో హాంకాంగ్ సైబర్ నేరగాళ్లు ఏర్పాటు చేసిన వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ (వీఓఐపీ) సెంటర్‌‌పై టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) అధికారులు గురువారం దాడులు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కాల్‌ రూటింగ్ బాక్స్‌ సహా 200 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురూ ఇంటర్నేషనల్  ఫోన్‌ కాల్స్​ను స్థానిక నంబర్లుగా చూపుతూ సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. 

సీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌  వివరాల ప్రకారం..చాంద్రాయణ గుట్ట హఫీజ్‌బాబానగర్‌‌కు చెందిన హిదాయతుల్లా(28) హాంకాంగ్‌ నుంచి ఆపరేట్‌ చేస్తున్న ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో రూ.16 లక్షలు కోల్పోయాడు. ఈ క్రమంలోనే అతనికి హాంకాంగ్‌కు చెందిన వెనిస్సా అనే మహిళతో పరిచయమైంది. ఆమె యూకే ఫోన్‌ నంబర్‌ ద్వారా వాట్సాప్‌లో హిదాయతుల్లాతో చాటింగ్‌ చేసేది. తాను చెప్పినట్లుగా చేస్తే  ఇన్వెస్ట్​మెంట్‌ ఫ్రాడ్‌లో పోగొట్టుకున్న డబ్బుతో పాటు భారీ మొత్తం సంపాదించవచ్చని చెప్పింది. దానికి హిదాయతుల్లా అంగీకరించడంతో.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొరియర్ ద్వారా చాంద్రాయణ గుట్టకు సిమ్ బాక్స్ పంపింది. 

ఆ తర్వాత వెనిస్సా చెప్పిన విధంగా  హిదాయతుల్లా తన ఇంట్లో వీఓఐపీ కాల్‌ సెంటర్‌‌ ఇన్‌స్టాల్‌ చేయించాడు.  తర్వాత తన స్నేహితులైన అహ్మద్ ఖాన్,షేక్‌ షోయబ్ ల ద్వారా దాదాపు 500 సిమ్ కార్డులు సేకరించాడు. వీటిని వెనిస్సా చెప్పిన విధంగా ప్రత్యేక సిమ్‌బాక్స్​లో ఫిక్స్ చేశాడు. ఇలా సిమ్‌బాక్స్​ను వినియోగించి హాంకాంగ్‌లో ఉండే వెనిస్సా.. వీఓఐపీ కాల్స్​ను స్థానిక ఫోన్‌ నంబర్లుగా మార్చి సైబర్‌ మోసాలకు పాల్పడింది.గుట్టురట్టు చేసిన ఛక్షు పోర్టల్‌ డిపార్ట్​మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌(డీఓటీ)కు చెందిన ఛక్షు పోర్టల్‌కు వీఓఐపీ సైబర్ నేరానికి సంబంధించిన ఫిర్యాదు అందింది. 

అంతర్జాతీయ నంబర్లను స్థానిక నంబర్లుగా రూటింగ్‌ చేస్తూ  మోసాలకు పాల్పడుతున్నట్లు డీఓటీ అధికారులు గుర్తించారు. అనుమానిత నంబర్ల  కాల్‌ డాటా రికార్డ్స్‌ విశ్లేషించారు. చాంద్రాయణగుట్టలోనే వీఓఐపీ కాల్‌ సెంటర్ ఆపరేట్‌ చేస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. గురువారం టీజీసీఎస్‌బీ, డీఓటీ సంయుక్తంగా దాడి చేసి హిదాయుతుల్లా, అహద్ ఖాన్, షేక్ షోయబ్ లను అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక సిమ్ బాక్స్, 200 సిమ్ కార్డులు సీజ్ చేశారు. విదేశాల నుంచి  స్కామ్ నడుపుతున్న వెనిస్సాతోపాటు ఇతర నిందితులను గుర్తించే దిశగా  దర్యాప్తు చేస్తున్నారు.