
సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది... సైబర్ క్రైమ్ పోలీసులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతున్నప్పటికీ సైబర్ నేరగాళ్ళ ఆగడాలు ఆగడంలేదు. రోజుకో రోజుకో రకం స్కాంతో సామాన్యులను దోచుకుంటున్నారు కేటుగాళ్లు. ఇప్పుడు హైదరాబాద్ లో మరో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని బాచుపల్లిలో క్రెడిట్ కార్డు, డిజిటల్ పేమెంట్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 9 మందిని అరెస్ట్ చేసారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
బాచుపల్లిలోని విల్లా అద్దెకు తీసుకొని.. ఏకంగా నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు కేటుగాళ్లు. ఈ నకిలీ కాల్ సెంటర్ ద్వారా ఇండియా, అమెరికా లోని అమాయకులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. పక్కా సమాచారంతో బాచుపల్లిలోని విల్లాపై దాడి చేసిన పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి పెద్దఎత్తున లాప్ టాప్స్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు బాచుపల్లి పోలీసులు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. క్రెడి కార్డు, డిజిటల్ పేమెంట్స్ పేరుతో కాల్స్ వస్తే గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తే భయపడకుండా తమకు ఫిర్యాదు చేయాలనీ కోరుతున్నారు పోలీసులు. బ్యాంకు సిబ్బంది పేరుతో ఫోన్ కాల్స్ లో ఓటీపీలు అడిగితే ఎట్టి పరిస్థితిలో చెప్పొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు.