బషీర్‌బాగ్, వెలుగు: నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్‌ను నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, అడిషనల్ డీజీపీ చారుసింహ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. నుమాయిష్ హైదరాబాద్ గుర్తింపులో కీలక భాగమని పేర్కొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు ఈ స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైబర్ నేరాలు, మహిళల రక్షణ కోసం పనిచేస్తున్న షీ టీమ్స్, భరోసా సేవలపై పూర్తి సమాచారం అందిస్తామన్నారు. పిల్లలకు చిన్ననాటి నుంచే రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సొసైటీ నగర పోలీసులకు రూ.15 లక్షల విరాళ చెక్కును అందజేసింది.
