హైదరాబాద్ సిటీ/దుండిగల్, వెలుగు: బాధితుల ఇండ్లకే వచ్చి పోలీసులు ఫిర్యాదులు స్వీకరించే ‘విక్టిమ్/ సిటిజన్ సెంట్రిక్’ పోలీసింగ్ మొదలైంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం మొట్టమొదటి కేసు నమోదైంది. ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్ ప్రొసీజర్ ప్రకారం.. బాధితులు డయల్ 100కు లేదా పోలీస్ స్టేషన్‌కు కాల్ వస్తే పెట్రోలింగ్ పోలీసులు, లేదా బ్లూకోల్ట్స్ సిబ్బంది ఘటనాస్థలానికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించాలి. ఈ మేరకు గాగిల్లాపూర్ గ్రీన్ వుడ్స్ విల్లాలో జరిగిన చోరీకి సంబంధించి బాధితుడి ఇంటి వద్దనే పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. అనంతరం కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు.
సత్వర న్యాయం కోసమే: సజ్జనార్ బషీర్‌బాగ్ : బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్ అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. బుధవారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ.. శారీరకంగా, మానసికంగా కుంగిపోయిన బాధితులు పోలీస్ స్టేషన్‌కు తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదనే సదుద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనల్లో ఈ విధానం ద్వారా బాధితులకు వేగంగా సేవలు అందించవచ్చన్నారు. ఈ విధానం ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోతే హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555కు వివరాలు పంపాలని సీపీ సూచించారు.
