ప్రవల్లిక మృతికి కారణం.. ప్రేమ వ్యవహారమే

ప్రవల్లిక మృతికి కారణం.. ప్రేమ వ్యవహారమే
  • ఓ యువకుడిని ప్రేమించి మోసపోయింది: డీసీపీ
  • 15 రోజుల క్రితమేహాస్టల్​లో చేరింది 
  • ఇప్పటి వరకు ఎలాంటి పరీక్షలు రాయలేదు 
  • నిందితుడు శివరామ్ రాథోడ్​పై కేసు పెట్టినట్లు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: విద్యార్థిని మర్రి ప్రవల్లిక(23) ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను సెంట్రల్ డీసీపీ వెంకటేశ్వర్లు శనివారం మీడియాకు వెల్లడించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజుపల్లికి చెందిన ప్రవల్లిక 15 రోజుల క్రితమే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ అశోక్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బృందావన్‌‌‌‌‌‌‌‌ గర్ల్స్‌‌‌‌‌‌‌‌ హాస్టల్‌‌‌‌‌‌‌‌లో చేరిందని ఆయన తెలిపారు. పోటీ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటోందని చెప్పారు. 

డిగ్రీ పూర్తి చేసిన ప్రవల్లిక.. ఇప్పటి వరకు ఎలాంటి పోటీ పరీక్షలు రాయలేదని, గ్రూప్స్ కు అప్లయ్ చేయలేదని పేర్కొన్నారు. ‘‘హాస్టల్ లో ప్రవల్లిక రూమ్ లో మరో ముగ్గురు అమ్మాయిలు ఉంటున్నారు. ప్రవల్లిక ఎక్కువగా మాట్లాడేది కాదు. శుక్రవారం సాయంత్రం వరకు  ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌తో ఉన్న ప్రవల్లిక.. ఆ తర్వాత రూమ్‌‌‌‌‌‌‌‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌‌‌‌‌‌‌‌కు ఉరేసుకుంది. రాత్రి 8:30 గంటల టైమ్ లో రూమ్‌‌‌‌‌‌‌‌మేట్స్‌‌‌‌‌‌‌‌ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు” అని వివరించారు. 

ప్రేమికుడు మోసం చేశాడనే.. 

ప్రవల్లిక ఆత్మహత్య చేసుకున్న రూమ్ లో సూసైడ్ నోట్‌‌‌‌‌‌‌‌తో పాటు లవ్ సింబల్స్‌‌‌‌‌‌‌‌తో ఉన్న ఓ లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. ‘‘ప్రవల్లిక సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌కి ఎలాంటి పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్స్‌‌‌‌‌‌‌‌ లేవు. వాట్సాప్ చాటింగ్‌‌‌‌‌‌‌‌, కాల్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌ పరిశీలించాం. వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా కోస్గికి చెందిన శివరామ్‌‌‌‌‌‌‌‌ రాథోడ్‌‌‌‌‌‌‌‌ అనే యువకుడిని ఆమె ప్రేమించినట్లు ఆధారాలు దొరికాయి. శివరామ్‌‌‌‌‌‌‌‌ మరో అమ్మాయితో ఎంగేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడని తన ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌తో ప్రవల్లిక చేసిన చాటింగ్స్‌‌‌‌‌‌‌‌ ను బట్టి అర్థమైంది. 

శుక్రవారం ఉదయం 11గంటలకు  అశోక్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బాలాజీదర్శణి హోటల్‌‌‌‌‌‌‌‌లో ప్రవల్లిక, శివరామ్ రాథోడ్ కలిసి టిఫిన్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నాం. శివరామ్ మోసం చేశాడని ప్రవల్లిక కుంగిపోయింది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని నిర్ధారించాం” అని చెప్పారు. శివరామ్ రాథోడ్ పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ‘‘ప్రవల్లిక రూమ్‌‌‌‌‌‌‌‌మేట్స్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్ రికార్డ్ చేశాం. ప్రవల్లిక తమ్ముడు ప్రణయ్‌‌‌‌‌‌‌‌ కూకట్‌‌‌‌‌‌‌‌పల్లిలో డిగ్రీ చదువుతున్నాడు. ప్రవల్లిక ప్రేమ విషయం వాళ్ల ఇంట్లో కూడా తెలిసి ఉండొచ్చు. సూసైడ్ నోట్‌‌‌‌‌‌‌‌ లో ఉన్న హ్యాండ్ రైటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రవల్లికదా? కాదా? అనేది నిర్ధారించేందుకు.. ఆమె నోట్‌‌‌‌‌‌‌‌బుక్స్ స్వాధీనం చేసుకున్నాం” అని వివరించారు. 

పోలీసులపై దాడిచేసినోళ్లపై కేసు పెడ్తం.. 

ప్రవల్లిక ఆత్మహత్య విషయం తెలియగానే చిక్కడపల్లి పోలీసులు హాస్టల్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారని డీసీపీ తెలిపారు. ‘‘ప్రవల్లిక డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న నిరుద్యోగ, విద్యార్థి సంఘాల లీడర్లు, ప్రతిపక్ష పార్టీల నేతలు అడ్డుకున్నారు. పోటీ పరీక్షలు వాయిదా పడడంతోనే ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి, పోలీసులపై రాళ్లు రువ్వారు. 

ఈ క్రమంలో ఏసీపీ కేవీఆర్ సత్యనారాయణ, సైఫాబాద్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఐ తరుణ్‌‌‌‌‌‌‌‌కి గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ప్రవల్లిక మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కి తరలించి పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం పూర్తి చేశారు. శనివారం తెల్లవారుజామున వరంగల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు” అని చెప్పారు. పోలీసులపై దాడి చేసినోళ్లపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.