‘డయల్‌‌ 100’లో ఏఐ..టెలీకాలర్‌‌‌‌ తరహాలోనే వివరాలు సేకరించనున్న ఏఐ

‘డయల్‌‌ 100’లో ఏఐ..టెలీకాలర్‌‌‌‌ తరహాలోనే వివరాలు సేకరించనున్న ఏఐ
  •     పెట్రోలింగ్‌‌, బ్లూ కోల్ట్స్‌‌ పోలీసులకు బాధితుల లొకేషన్‌‌
  •     కాల్  ఆన్సర్ లో లేట్ కాకుండా ఉండేందుకు యత్నం

హైదరాబాద్‌‌, వెలుగు: అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సర్వీస్‌‌ ‘డయల్‌‌100’  సేవలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌(ఏఐ) జత కానుంది. టెలీకాలర్‌‌  తరహాలో ఏఐ ఆధారిత వర్చువల్‌‌  వాయిస్‌‌.. బాధితుల నుంచి సమాచారం సేకరిస్తుంది. ‘ఆటోమేటిక్  స్పీచ్  రికగ్నిషన్’  టూల్‌‌ ద్వారా బాధితుల వాయిన్ ను రికార్డు  చేస్తుంది. కాల్‌‌  చేసిన వ్యక్తి పేరు, నివాస స్థలం, ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటుంది. 

ఆయా వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లకు చేరవేస్తుంది. ఇందుకు సంబంధించిన ఏఐ టూల్స్‌‌ను పోలీస్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌‌  టైమ్‌‌ను మరింత తగ్గించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా  బాధితుల ఫోన్  నంబర్, లొకేషన్‌‌  ఆధారంగా ఆయా పోలీస్ స్టేషన్ల పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ సిబ్బందికి మరింత స్మార్ట్‌‌ సేవలు మరింత వేగవంతం అవుతాయని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రోజుకు సగటున 4 వేల నుంచి 5 వేల ఫోన్‌‌ కాల్స్‌‌ 

2013 ఏప్రిల్‌‌11న ఎమర్జెన్సీ సర్వీస్‌‌ ‘డయల్ 100’ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌‌ స్టేషన్లు, పోలీస్‌‌ కమాండ్‌‌  కంట్రోల్‌‌  సెంటర్లతో ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ‘డయల్‌‌100’ కు రాష్ట్రవ్యాప్తంగా రోజూ సుమారు 4 వేల నుంచి 5 వేల కాల్స్‌‌  వస్తున్నాయి. ఈ క్రమంలోనే నిరుడు 16,10,778 కాల్స్  వచ్చాయి. కాల్ వచ్చిన వెంటనే  పట్టణ ప్రాంతాల్లో సగటున 5 నుంచి 8 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో  పోలీసులు స్పాట్‌‌కు చేరుకుంటున్నారు. 

ప్రస్తుతం కాల్స్‌‌  రూటింగ్‌‌లో సర్వీస్  బిజీ రావడం లేదా కాల్‌‌  ఆన్సర్  చేయడంలో కొంత సమయం ఆలస్యం జరుగుతోంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకే  ఏఐ టెక్నాలజీ వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలోనే  రెస్పాన్స్‌‌  టైమ్‌‌ను మరింత తగ్గించేందుకు త్వరలోనే  ఏఐ డయల్ 100ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఆటోమేటిక్, వాయిస్ రికార్డ్‌‌, ట్రాకింగ్‌‌  ఇలా..

ఆటోమేటిక్  స్పీచ్  రికగ్నిషన్, ప్రెడిక్టివ్  అనలిటిక్స్  వంటి ఏఐ- ఆధారిత టెక్నాలజీ ద్వారా పరిస్థితులను త్వరగా అంచనా వేస్తుంటారు. టెక్నాలజీకి అనుగుణంగా ఎమర్జెన్సీ సర్వీస్‌‌లో పోలీస్ డిపార్ట్‌‌మెంట్  ఆర్టిఫిషియల్‌‌  ఇంటెలిజెన్స్‌‌  వినియోగిస్తోంది. బాధితుల పూర్తి వివరాలు సహా రియల్ -టైం లొకేషన్  ట్రాకింగ్ అతి తక్కువ సమయంలో నిర్ధారించవచ్చు. 

దీంతో పాటు పెట్రోలింగ్  పోలీసులు బాధితులకు వెంటనే రీకాల్‌‌  చేసే విధంగా ఏఐ టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌‌ సంస్థలకు చెందిన హెల్ప్‌‌లైన్‌‌  నంబర్లకు వచ్చే  రూటింగ్‌‌  కాల్స్‌‌  కూడా కొన్ని టెక్నికల్  సమస్యల వల్ల డయల్ 100కి కనెక్ట్‌‌  అవుతుంటాయి. ఇలాంటి సమస్యకు కూడా ఏఐ ద్వారా పరిష్కారం లభిస్తుందని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు.