- సబ్స్టేషన్లపై పడుతున్న ఓవర్ లోడ్
- గత ఆరు రోజుల్లో పేలిన 300 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ ఫార్మర్లు
- జీహెచ్ఎంసీలోని 1.45 లక్షల డీటీఆర్‌ల పరిధిలో లోడ్ పరీక్షించి రిపోర్ట్ ఇవ్వాలని సీఎండీ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌లో కరెంట్వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు తీవ్రమవడం వల్ల ఏసీలు, కూలర్ల వినియోగం రెట్టింపు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో సబ్ స్టేషన్లపై ఓవర్‌లోడ్ పడుతున్నది. గత ఆరు రోజుల్లో గ్రేటర్ పరిధిలో 300 డీటీఆర్లు కాలిపోయాయని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. మే లో ఇంకా ఎండలు ఉండే ప్రమాదం పొంచి ఉండడంతో డీటీఆర్లపై ఒత్తిడి తగ్గించడానికి లోడ్పరీక్షలు చేయాలని దక్షిణ డిస్కం సీఎండీ జితేశ్ వి.పాటిల్ఇంజినీర్లను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 1.45 లక్షల డీటీఆర్లను టాంగ్ టెస్టర్ద్వారా పరీక్షించి నివేదికలను పంపాలన్నారు.
గ్రేటర్ పరిధిలో 65 లక్షల విద్యుత్ కనెక్షన్లు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 65 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 8 లక్షల వాణిజ్య, 55 లక్షలు గృహ, 50 వేలకు పైగా పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. ఈ వేసవిలో మార్చి చివరి వారంలోనే విద్యుత్డిమాండ్లో ఆల్‌టైమ్ రికార్డులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మార్చి 3న విద్యుత్ డిమాండ్18,139 మెగావాట్లకు చేరుకున్నది. గ్రేటర్ పరిధిలో రోజుకు 4,440 మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ ఉంది. 2024 మే 29న అత్యధికంగా 91.69 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదు కాగా, చరిత్రలోనే తొలిసారిగా 2026 ఏప్రిల్ 17న 100.56 మిలియన్ యూనిట్లు దాటింది.
పేలిపోతున్న డీటీఆర్లు..
గ్రేటర్లో అంచనాలకు మించి విద్యుత్ వినియోగం పెరిగిపోతుండడంతో లోడ్ ఎక్కువై డీటీఆర్ లు కాలిపోతున్నాయి. ఆయిల్ లీకేజీలను అరికట్టకపోవడం, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు డీటీఆర్ ల సామర్థ్యాన్ని పెంచకపోవడం, లోడ్ బ్యాలెన్స్ చేయకపోవడం, ఎప్పటికప్పుడు టంగ్ టెస్టర్ లోడ్‌ను పరిశీలించకపోవడంతో కరెంట్వినియోగం అనూహ్యంగా పెరిగి ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా రాజేంద్రనగర్, సైబర్ సిటీ సర్కిళ్ల పరిధిలోనే డీటీఆర్లు పేలిన ఘటనలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ‘ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య పీక్ టైమ్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్ డిమాండ్ కు తగ్గట్లుగా కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎక్స్పర్ట్స్చెబుతున్నారు.
1.45 లక్షల డీటీఆర్‌ల దగ్గర టాంగ్ టెస్టర్ పరీక్షలు..
గ్రేటర్ లో విద్యుత్ డిమాండ్ పెరిగి డీటీఆర్లు పేలిపోతుండడంతో ఈ సమస్యను పరిష్కరించడానికి 1.45 లక్షల డీటీఆర్‌ల దగ్గర టాంగ్ టెస్టర్ పరీక్షలు చేస్తున్నాం. దీని వల్ల 132/11 కేవీ సబ్ స్టేషన్, 33/11 కేవీ సబ్‌స్టేషన్ వద్ద ఎంత లోడ్ ఉన్నది..? డీటీఆర్వద్ద ఎంత లోడ్ ఉందో తమకు స్పష్టంగా తెలిసిపోతుంది. లైన్మెన్లు, లైన్ఇన్స్పెక్టర్లు లోడ్ పరీక్షించే పనిలోనే ఉన్నారు. లోడ్ఎక్కువగా ఉన్న డీటీఆర్లను వెంటనే మార్చి కొత్తవి ఏర్పాటు చేసి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్అందజేస్తాం.
– జితేశ్ వి.పాటిల్, దక్షిణ డిస్కం సీఎండీ, హైదరాబాద్

