
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ప్రజావాణికి సోమవారం 59 ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులు స్వీకరించారు. టోలిచౌకి హకీంపేటలో బాబా హోటల్ వద్ద రోడ్దును ఆక్రమించి షాపు పెట్టేశారంటూ నివాసితులు ఫిర్యాదు చేశారు. కుత్బుల్లాపూర్ మండలం సుభాష్ నగర్‌లో కొంపల్లికి వెళ్లే 50 అడుగుల రహదారి10 ఫీట్లకే పరిమితమైందని స్థానికులు ఫిర్యాదు చేశారు. గాజుల రామారంలో సర్వే నంబరు155లో ప్రభుత్వ హాస్పిటల్కోసం కేటాయించిన 3500 గజాల స్థలాన్ని కబ్జా చేస్తున్నారని భగత్ సింగ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీ ప్రజావాణికి ఫిర్యాదు చేసింది.
ఓయూ కాలనీలో తమ ప్లాట్ ను నలువైపుల మూసివేయడంతోపాటు రహదారి పక్కనే ఉన్న శ్మశానాన్ని కూడా విక్రయించారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ప్రజల ఫిర్యాదులను పరిశీలించిన రంగనాథ్ విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో నిర్వహించిన ప్రజావాణికి 66 ఫిర్యాదులు రాగా, కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్వీకరించారు. ఆర్థికపరమైన ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఫిర్యాదుదారులకు లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు.
గ్రేటర్ లోని ఆరు జోన్లలో మొత్తం 113 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో కూకట్ పల్లి జోన్ లో 40, శేరిలింగంపల్లి జోన్ లో 14, ఎల్బీనగర్ జోన్ లో 9, సికింద్రాబాద్ జోన్ లో 17, చార్మినార్ జోన్ లో 3, ఖైరతాబాద్ జోన్ 30 ఫిర్యాదులు అందాయి. ఇక హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి వరుసగా 101,53 ఫిర్యాదులు వచ్చినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు.