- బాలిక ఘటనకు ప్లాన్ చేసింది అతడే
- రిమాండ్ రిపోర్టులో పోలీసులు
- ఎమ్మెల్యే కొడుకుపై కేసు
- నమోదు చేసేందుకు చర్యలు
- ఆరో నిందితుడిగా చేర్చే అవకాశం
- బాధితురాలు, తల్లిదండ్రుల స్టేట్‌మెంట్ రికార్డ్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌లో బాలిక ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బెంజ్ కారులో ఫొటోలు, వీడియోల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌లో అతడిని ఆరో నిందితునిగా చేర్చనున్నారు. విదేశాల్లో ఉంటే ఇంటర్‌పోల్ సాయంతో లుక్‌ఔట్ నోటీసులు ఇచ్చేందుకు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. సోమవారం బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. సీల్డ్ కవర్‌లో కోర్టు కస్టడీలో పెట్టారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు నిందితులు సాక్ష్యాలు తారుమారు చేశారని 201 ఐపీసీ సెక్షన్ కింద చర్యలు ప్రారంభించారు. బెంజ్, ఇన్నోవా కార్లను బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో మరోసారి పరిశీలించారు.
రిమాండ్ రిపోర్ట్‌లో కీలక వివరాలు
కార్పొరేటర్ కొడుకే ఘటనకు ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నట్లు తెలిసింది. కార్పొరేటర్ కొడుకు, సాదుద్దీన్ మాలిక్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కొడుకు, మిగతా నిందితులు బాధితురాలిని ట్రాప్ చేశారని వివరించినట్లు సమాచారం.‘‘మే 28న అమ్నీషియా పబ్‌లో ఇద్దరు మైనర్లను వేధించారు. దీంతో ఇద్దరు బాలికలు పబ్ నుంచి బయటకు వచ్చారని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత ఒకమ్మాయి క్యాబ్‌లో వెళ్లిపోయింది. వెంటనే సాదుద్దీన్‌తోపాటు మిగతా నిందితులు పబ్ నుంచి బయటకు వచ్చారు. పబ్ బయట నిల్చున్న బాధితురాలిని కార్పొరేటర్ కొడుకు కలిసి, బాధితురాలు వెళ్లే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 రూట్‌లో తాము వెళ్తున్నామని, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని నమ్మించాడు. మాజీ ఎమ్మెల్యే మనవడు ఉమేర్‌ఖాన్‌కు చెందిన బెంజ్ కారులో బాధితురాలిని ఎక్కించుకున్నారు. అమ్మాయితోపాటు సాదుద్దీన్, ఎమ్మెల్యే కొడుకు, మరో మైనర్ బెంజ్ కారులో వెళ్లారు. అదే కారు వెనుక వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కొడుకు ఇన్నోవాలో ఫాలో అయ్యాడు. ప్రయాణిస్తున్నపుడే ఎమ్మెల్యే కొడుకుతో సహా నలుగురు నిందితులు బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించారు. అప్పుడే ఎమ్మెల్యే కొడుకుకి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అతను కారు దిగి వెళ్లిపోయాడు’’ అని రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నట్లు తెలిసింది.
బెంజ్‌లో వేధింపులు.. ఇన్నోవాలో ఘటన
‘‘బెంజ్ కారులో వేధింపులకు గురి చేయడంతో తాను వెళ్లిపోతానని బాధితురాలు చెప్పింది. దీంతో సమీపంలోని కాన్సు బేకరీకి వెళ్లి.. అక్కడి నుంచి ఇంటికి వెళ్దామని ఆమెను వాళ్లు నమ్మించారు. బేకరీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత బెంజ్ కారులో పెట్రోల్ అయిపోయిందని చెప్పారు. అప్పటికే బయట రెడీగా ఉన్న ఇన్నోవా కారులో అమ్మాయిని ఎక్కించుకున్నారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లారు. అందులోనే ముగ్గురు మైనర్ల సహా సాదుద్దీన్, ఉమేర్‌ఖాన్‌లు వరుసగా అత్యాచారం జరిపారు” అని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించినట్లు సమాచారం. తర్వాత బెంజ్ కారులో దిగిన ఫొటోలను నిందితులు సోషల్ మీడియాలో ఫ్రెండ్స్‌కి పంపించారు. తర్వాత బాధితురాలిని పబ్ వద్ద వదిలి వెళ్లిపోయారు. 31వ తేదీన కేసు నమోదు కావడంతో ఇండ్ల నుంచి వివిధ ప్రాంతాలకు పారిపోయారని పోలీసులు చెప్పినట్లు తెలిసింది.
యూట్యూబ్‌లో వీడియోలు వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్
మైనర్ బాలికపై వీడియోలు వైరల్ చేసిన యూట్యూబ్ చానెల్ ప్రతినిధిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పాతబస్తీకి చెందిన సుభాన్, ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. 28న జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై దాడికి పాల్పడిన నిందితులు తమ ఫోన్లో వీడియోలు తీశారు. ఆ వీడియోలను వారు తమ స్నేహితులకు పంపించారు. వాటిని సేకరించిన సుభాన్ సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
