- ఐటీ కారిడార్ తో పాటు సిటీ ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్స్
- అంతటా స్లోగా కదిలిన వాహనాలు
- ఎర్లీ లాగౌట్ లైట్తీసుకున్న ఐటీ కంపెనీలు
మాదాపూర్, వెలుగు: నగరంలో మంగళవారం సాయంత్రం నుంచి మొదలైన జోరు వాన బుధవారం కూడా ముసురు రూపంలో కొనసాగింది. దీంతో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వాహనాల కదలిక మందగించింది. ఐటీ కారిడార్‌తో పాటు బేగంపేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, మెహదీపట్నం, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామయ్యింది. జేఎన్‌టీయూ నుంచి బయో డైవర్సీటీ రోడ్డు, షేక్పేట్నుంచి ఖాజగూడ మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే రోడ్డు రద్దీగా మారింది. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చే రోడ్డులో డోయెన్స్ కాలనీ ఎదురుగా రోడ్లకు రిపేర్లు జరుగుతుండడంతో వాహనాలు కిలోమీటర్ల మేర క్యూ కట్టాయి.
గచ్చిబౌలి నుంచి కొత్తగూడ మీదుగా కొండాపూర్వైపు తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. వర్షం పడుతుండడంతో రోజూ బైక్‌లపై వచ్చే వారు కార్లను ఆశ్రయించడంతో ట్రాఫిక్ మరింత పెరిగింది. పలుచోట్ల లోతట్లు కాలనీలు, అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి వరద చేరింది. దీంతో మోటార్లు పెట్టి బయటకు పంపించాల్సి వచ్చింది.
బుధవారం రాత్రి కూడా..
మంగళవారం ఉదయం ముసురు ఇబ్బంది పెట్టగా బుధవారం రాత్రి జోరు వాన కురిసింది. దీంతో మాసబ్ ట్యాంక్ ఎన్‌ఎండీసీ వైపు రోడ్డుపై నీళ్లు చేరి ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, జీహెచ్‌ఎంసీ బృందాలు చేరుకుని నీటిని తొలగించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది తప్పింది.
ఎర్లీ లాగౌట్పట్టించుకోలే..
భారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజుల ముందే అలర్టయిన సైబరాబాద్పోలీసులు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఎర్లీ లాగౌట్ ఇవ్వాలని ట్రాఫిక్అడ్వైజరీ ఇవ్వగా, ఎవరూ పట్టించుకోలేదు. దీంతో బుధవారం సాయంత్రం అంతా ఒకే టైమ్‌కు ఆఫీసుల నుంచి బయటకు రావడంతో ట్రాఫిక్ జామయ్యింది.
వాటర్ లాగింగ్ పాయింట్ల పరిశీలన..
సైబరాబాద్ సీపీ రమేశ్, సీఎంసీ కమిషనర్ సృజన, ట్రాఫిక్ జాయింట్సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఐటీ కారిడార్‌లో వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించారు.
మ్యాన్ హోల్ లో కొట్టుకుపోయిన వృద్ధుడు దొరకలే..
మాదాపూర్: హఫీజ్‌పేట్–మదీనాగూడ వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ వద్ద తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో గల్లంతైన వృద్ధుడి ఆచూకీ లభించలేదు. హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన బాలయ్య (70) మంగళవారం రాత్రి వర్షంలో రోడ్డు దాటుతుండగా వరద ఉధృతి కారణంగా నిర్మాణంలో ఉన్న నాలా వద్ద తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. హైడ్రా డీఆర్ఎఫ్, మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లు, పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది గాలిస్తున్నారు. 3 కిలోమీటర్ల మేర పైప్‌లైన్, బాక్స్ డ్రెయిన్‌లలో వెతికినా దొరకలేదు.
నాలాలో పడిన ఆవు
నేరేడ్‌మెట్/మల్కాజ్ గిరి, వెలుగు: నగరంలోని 187వ డివిజన్ పరిధి కాకతీయ నగర్ నాలాలో బుధవారం ఓ ఆవు పడిపోయింది. గమనించిన కాలనీ వాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలతో వచ్చి, ఆవును సురక్షితంగా
బయటకు తీశారు.
