ఆర్టీసీలో అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ బస్సులు.. 20 నెలల్లో విడతల వారీగా  ఒలెక్ట్రా బస్సుల సరఫరా  

ఆర్టీసీలో అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ బస్సులు.. 20 నెలల్లో విడతల వారీగా  ఒలెక్ట్రా బస్సుల సరఫరా  

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్  సిటీ  ప్రజలకు సుస్థిర ప్రయాణంతో పాటు  పర్యావరణహిత ప్రజా రవాణా అందించేందుకు గ్రేటర్​  ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నగరాలు, పట్టణాల్లో ఎలక్ట్రిక్  ప్రజా రవాణాను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  పీఎం ఈ– డ్రైవ్   పథకంలో భాగంగా  హైదరాబాద్  నగరానికి 1,085 బస్సులు రానున్నాయి. ఒలెక్ట్రా గ్రీన్ టెక్  లిమిటెడ్ (ఓజీఎల్ ) బస్సులను సరఫరా చేయనుంది. వీటి రాకతో  నగరంలో సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని తెలిపారు. ‘‘గ్రేటర్​ హైదరాబాద్  పరిధిలో ప్రస్తుతం 3,200 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ఇందులో 325 బస్సులు ఎలక్ట్రిక్​ వాహనాలు కాగా త్వరలో మరో 175 బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న ఎలక్ట్రిక్​ బస్సులు చార్జింగ్​ సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

ఒక్కో బస్సు ఫుల్​ చార్జి కావడానికి 90 నిమిషాలు పడుతోంది.  దీంతో 200 కి.మీ. మేరకు మాత్రమే అవి నడుస్తాయి. కొత్తగా వచ్చే ఈవీ బస్సులు 45 నిమిషాల్లోనే ఫుల్​ చార్జింగ్​ అవుతాయి. అంతేకాకుండా 250 కి.మీ. వరకూ పనిచేస్తాయి” అని అధికారులు తెలిపారు. ఇక  ప్రస్తుతం ఉన్న బస్సుల ఫ్లోర్​ హైట్​ కూడా ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు, వృద్ధలు ఎక్కడానికి కొంత ఇబ్బంది పడుతున్నారని, కానీ, కొత్త బస్సుల ఫ్లోర్​డిజైన్​ భూమికి 400 మి.మీ. ఎత్తులోనే ఉందని చెప్పారు. దీంతో పిల్లలు, వృద్దులు బస్సు ఎక్కడానికి సులభంగా ఉంటుందన్నారు. బస్సుల తయారీ సంస్థ రాబోయే 20 నెలల్లో విడతల వారీగా బస్సులను సరఫరా చేస్తుందని వెల్లడించారు.