
ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేయాల్సిందేనని దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. దక్షిణాది రెండో రాజధానిని ఏ శక్తి అడ్డుకోలేదని, అడ్డుకుంటే అంబేద్కర్ను వ్యతిరేకించినట్లేనన్నారు. రెండో రాజధాని గురించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రస్తావించారని తెలిపారు. ఈ అంశంపై శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వినోద్ కుమార్, ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ చలసాని శ్రీనివాస్, జిలకర శ్రీనివాస్ హాజరయ్యారు.
వారు మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ను, పార్లమెంటును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణాదికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ప్రాంతాల వారికి ప్రధాని పదవి, కీలక శాఖలు ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హైదరాబాద్ ను దక్షిణాదికి రాజధానిగా చేసేలా కృషి చేయాలని కోరారు. దండి వెంకట్, వేల్పుల సంజయ్, మేధావులు, నాయకులు పాల్గొన్నారు.