- ఇండో– నేపాల్ బార్డర్‌లో నిఘా, స్థానిక పోలీసుల అలర్ట్
- ఢిల్లీ, ముంబై, లక్నో, పుణెలో కొనసాగుతున్న సెర్చింగ్
- ఫోన్ కాల్ డేటా ఆధారంగా అనుమానితుల విచారణ
- నిందితులను త్వరలోనే పట్టుకుంటం: డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, వెలుగు: నేపాలీ పని మనుషుల చేతుల్లో హత్యకు గురైన రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ (55) కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిటీ టాస్క్‌ఫోర్స్ సహా 10 బృందాలతో నాలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ‘నేపాలీ సర్వెంట్ గ్యాంగ్’పేరుతో గాలింపు నిర్వహిస్తున్నారు. నేపాల్ బార్డర్‌లో ఇద్దరు అనుమానితులు అదుపులోకి తీసుకుని విచారించగా.. మరో కేసులో నిందితులుగా తేలిందని సమాచారం. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఐపీఎస్ భార్య తనూజను శుక్రవారం తెల్లవారుజామున హత్య చేసి, బంగారం, నగదు దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. ప్రధాన నిందితురాలు కల్పన సహా ముగ్గురు సభ్యుల ముఠా కోసం ఢిల్లీ, లక్నో, పుణే సహా ఇండో నేపాల్ సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. కాగా, రాష్ట్ర పోలీసులకు నేపాల్ పోలీసుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని తెలిసింది.
ఫోన్ కాల్ డేటా, సీసీటీవీ కెమెరాలే ఆధారం!
నేపాలీ గ్యాంగ్ పథకం ప్రకారమే మాజీ ఐపీఎస్ ఇంట్లో సర్వెంట్స్‌గా చేరినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే గతంలో పనిచేసిన పనిమనుషులను విచారిస్తున్నారు. ప్రధానంగా ఎనిమిది నెలల క్రితం కల్పనను నియమించిన మరో నేపాలీ మహిళ మీన నుంచి వివరాలు సేకరించారు. కాగా, ఈ దోపిడీ కేసులో మొత్తం నలుగురు పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందస్తు ప్రణాళికతోనే హత్యకు పాల్పడినట్టు గుర్తించారు. తనూజ ఒంటరిగా ఉన్న విషయాన్ని కల్పన మిగతా నిందితులకు చెప్పినట్టు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో నిందితులు గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంట్లోకి ప్రవేశించినట్టు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. కల్పన, మీన ఫోన్ నంబర్ల ఆధారంగా సీడీఆర్ సేకరిస్తున్నారు. వీరి కాల్ లిస్టులో ఉన్న అనుమానితుల గురించి ఆరా తీస్తున్నారు. టవర్ లొకేషన్ ఆధారంగా ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
గాలింపు ముమ్మరం చేశాం: డీజీపీ
ఈ కేసు దర్యాప్తును డీజీపీ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తనూజ మృతదేహానికి ఆయన శనివారం నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నదన్నారు. సాధారణంగా నేపాలీ సర్వెంట్ గ్యాంగ్స్ హత్యలు చేయవన్నారు. మత్తు మందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లాక దోపిడీలు చేస్తాయన్నారు. కానీ, ఈ కేసులో అలా జరగలేదని అన్నారు. ఏదైనా కోపంతో చంపారా? లేక నోట్లో గుడ్డలు కుక్కడంతోనే మృతి చెందిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. నేపాలీల కోసం సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేసినట్టు తెలిపారు. బార్డర్ ద్వారా నేపాల్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున.. బోర్డర్ సెక్యూరిటీని అప్రమత్తం చేశామన్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని సీవీ ఆనంద్ తెలిపారు.
