
హైదరాబాద్: హైదరాబాద్లో కేపీహెచ్బీ (కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్) పేరు వినే ఉంటారు. ఒక 30, 40 ఏళ్ల క్రితం ఈ ఏరియాలో కొండలు, గుట్టలు తప్ప మనుషులు ఉన్న జాడ లేదని చెబుతుంటారు. ‘‘అప్పట్లో ఒకడుండేవాడు’’ సినిమాలో బ్రహ్మాజీ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. 1990s బ్యాక్ డ్రాప్లో నడిచే ఈ సినిమాలో ‘‘అసలు కూకట్ పల్లిలో మనుషులుంటార్రా..?’’ అని బ్రహ్మాజీ చెప్పిన డైలాగ్ చాలా ఫేమస్. కానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సిటీలో పబ్లిక్ ఎక్కువగా నివసించే ఏరియాల్లో కేపీహెచ్బీ(కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు) ఒకటి. తాజాగా.. ఫోర్త్ ఫేజ్లో భూములకు సంబంధించి ఆన్ లైన్లో వేలం నిర్వహిస్తే ఎకరం ఏకంగా 70 కోట్ల రూపాయల రికార్డు ధర పలికింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ 547 కోట్ల రూపాయలకు 7.5 ఎకరాలు దక్కించుకుంది.
గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ హైదరాబాద్‌లో 2025 ఆరంభంలో అడుగుపెట్టింది. తన మొదటి హౌసింగ్ ప్రాజెక్ట్ నుంచి దాదాపు రూ.1,300 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ హైదరాబాద్‌లో తన మొదటి ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ 'గోద్రేజ్ మాడిసన్ అవెన్యూ'ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది కోకాపేటలో 3 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్ట్లో దాదాపు 12 లక్షల చదరపు అడుగుల అమ్మకపు ప్రాంతం ఉంటుంది. బుకింగ్ విలువ సుమారు రూ.1,300 కోట్లు ఉంటుందని గోద్రేజ్ ప్రాపర్టీస్ తెలిపింది. ఈ కంపెనీ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్), బెంగళూరు, పూణే హౌసింగ్ మార్కెట్లలోనూ వ్యాపారం చేస్తోంది.
హైదరాబాద్ కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని ఓపెన్ ప్లాట్ల విషయానికొస్తే.. జులై 30న నిర్వహించిన ఆన్ లైన్ వేలంలో కూడా ఒక ఎకరం రికార్డు స్థాయి ధర పలికింది. హౌసింగ్ బోర్డ్ అధికారులు నిర్వహించిన వేలంలో కేపీహెచ్బీ నాలుగో ఫేజ్లోని ప్లాట్ నంబర్1కు చెందిన ఒక ఎకరం విస్తీర్ణంలోని కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ను రూ.65.34 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. ఆన్లైన్ ద్వారా వేలం పాట నిర్వ హించినందున బిడ్డర్ల వివరాలు చివరి నిమిషం వరకు ఎవరికీ తెలియక పోవడం గమనార్హం.