హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగరాన్ని గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ రంగాలకు జాతీయ, అంతర్జాతీయ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా డిసెంబర్‌లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ సమిట్’ ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. ‘కథలు – ఆటలు – కలలు’ అనే ప్రత్యేక థీమ్‌తో అంతర్జాతీయ ఏవీజీసీ సంస్థలను ఆకర్షించేలా కామిక్ కాన్, డ్రీమ్‌హాక్, ఇండియా గేమ్ ఉత్సవ్‌లతో పాటు బీ2బీ ఎక్స్‌పో, ఇన్నోవేషన్ జోన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే నగరంలో 50 పెద్ద, 150కి పైగా మధ్యతరహా సంస్థలు కొలువుదీరి ఉన్నాయని, ఈ సమిట్ ద్వారా మరిన్ని పెట్టుబడులను సాధించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పారు. వినూత్న సాంకేతికత, నూతన ఆవిష్కరణలను నేరుగా తిలకించేందుకు వీలుగా 70 కాలేజీల విద్యార్థులతో పాటు మొత్తం 50 వేల మంది సందర్శకులు హాజరయ్యేలా ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి నేతృత్వంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
