- వివిధ దేశాల ప్రతినిధులను ఆహ్వానించండి: మంత్రి దామోదర
హైదరాబాద్, వెలుగు: వచ్చే జూన్ లో హైదరాబాద్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్యాగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం రెండు శాఖల ఉన్నతాధికారులతో సెక్రటేరియట్ లోని తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యానారాయణ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు. ఇకపై ఏటా హైదరాబాద్ లో కనీసం ఒక మెడికల్ టూరిజం ఈవెంట్ నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారని, ఇందుకు అనుగుణంగా ఈ ఏడాది జూన్ లో మొదటి ఈవెంట్ జరపనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇంటర్నేషనల్ పేషెంట్ సర్వీసెస్ విభాగాలను ఏర్పాటు చేయాలి
మెడికల్ టూరిజం ఈవెంట్ లో దేశ, విదేశాల వైద్య, ఫార్మా రంగ ప్రముఖులను భాగస్వాములను చేయాలని మంత్రి దామోదర సూచించారు. ఆఫ్రికా, ఏసియా, మిడిల్ ఈస్ట్ తదితర దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించాలని చెప్పారు. హైదరాబాద్ లోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌తోపాటు నిమ్స్, టిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ హాస్పిటళ్ల సందర్శనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న 3 టిమ్స్ హాస్పిటల్స్లో ఇంటర్నేషనల్ పేషెంట్ సర్వీసెస్ విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు.
12న నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు
వచ్చే నెల12న ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా 2,322 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే, టీవీవీపీ హాస్పిటల్స్ లో భర్తీ చేస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫార్మసిస్ట్, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీపై ఆరా తీశారు. వచ్చే నెల 15వ తేదీ నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. ఫార్మసిస్ట్, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో నెలకొన్న లీగల్ చిక్కులను పరిష్కరించి, నియామకాలను వెంటనే పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

