
- ఒక్కో హెలికాప్టర్ లో 6 నుంచి 8 సీట్లు
- నల్లమల అందాల విహంగ వీక్షణం
- రాష్ట్రంలో హెలీ టూరిజానికి సర్కార్ శ్రీకారం
- ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక శాఖ ప్రణాళికలు
- విజయవంతమైతే రామప్ప, లక్నవరానికీ విస్తరణ
హైదరాబాద్, వెలుగు: సాంస్కృతిక వారసత్వ కట్టడాలు.. ప్రకృతి అందాలు.. పచ్చని అడవులు.. గలగల పారే గోదారి సెలయేళ్లు.. కృష్ణమ్మ పరుగులు.. కిన్నెరసాని పరవళ్లు.. ఆధ్యాత్మిక కేంద్రాలకు ఆలవాలం మన తెలంగాణ. పర్యాటకులకు ఆహ్లాదం, ఆనందం కలిగిస్తూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఈ పర్యాటక ప్రాంతాలు.
దీంతో దేశ, విదేశీ టూరిస్ట్‌లు మన రాష్ట్రానికి తరలొస్తుంటారు. అయితే, రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇప్పటికే పర్యాటక రంగంలో 15 వేలపెట్టుబడులను ఆకర్షించిన పర్యాటకశాఖ.. భవిష్యత్తులో దేశానికి ఒక ఇన్నోవేటివ్ టూరిజానికి కేంద్ర బిందువుగా మార్చే దిశగా ముందుకుసాగుతున్నది.
ఇందులో భాగంగా ‘హెలీ టూరిజం’ను అందుబాటులోకి తీసుకొస్తున్నది. హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి పర్యాటకులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ప్రైవేట్ ఏవియేషన్, ఎయిర్లైన్స్సంస్థల భాగస్వామ్యంతో హెలికాప్టర్ సేవలను ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నది.
సరికొత్త అనుభూతికి శ్రీకారం
పర్యాటకులకు ఆహ్లాదంతోపాటు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు పర్యాటక శాఖ హెలీ టూరిజంపై ఫోకస్పెట్టింది. ఇప్పటికే ‘ఈజ్ మై ట్రిప్’ వంటి ప్రముఖ సంస్థలతోపాటు ఇతర ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కంపెనీలతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. వచ్చేఏడాది జనవరి మొదటి వారం లేదా సంక్రాంతి నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నది. తొలుత వారాంతాల్లో ఈ సర్వీసులను నడిపి, ఆదరణను బట్టి విస్తరించాలని టూరిజం అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్, నల్లమల్ల అడవుల మధ్యలో కృష్ణా నది ఒడ్డున ఉన్న సోమశిల, అమరగిరి అందాలను చూపిస్తూ శ్రీశైలం చేరుకుంటుంది. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నందున ఏపీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లనున్నది. ఈ యాత్ర ద్వారా పర్యాటకులు దట్టమైన నల్లమల అడవులు, కృష్ణమ్మ జల సవ్వడులు, ఎత్తైన కొండల అందాలను ఆకాశం నుంచి వీక్షించే అద్భుత అవకాశం లభిస్తుంది.
ఆరు గంటల ప్రయాణం.. గంటకు కుదింపు
హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి 220 కిలో మీటర్ల వరకు ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. అదే హెలికాప్టర్ ద్వారా ప్రయాణం చేస్తే గంటలోపే గమ్యాన్ని చేరుకోవచ్చు. ఇది ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, అంతర్జాతీయ పర్యాటకుల వీకెండ్ టూర్‌కు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఒక్కో హెలికాప్టర్‌లో 6 నుంచి 8 మంది ప్రయాణించేలా సీటింగ్ సామర్థ్యం ఉంటుంది.
దీనిద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. హెలీ టూరిజం కోసం రెండు నుంచి మూడు రోజుల ప్యాకేజీలను పర్యాటక శాఖ రూపొందించింది. ప్రయాణం, వసతి, దర్శనం వంటి అన్ని సౌకర్యాలను కలిపి త్వరలోనే ధరలను ఖరారు చేయనుంది. బుకింగ్ కోసం ప్రత్యేకంగా టూరిజం వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను తీసుకురానున్నారు.
శ్రీశైలం టూర్ విజయవంతమైతే.. భవిష్యత్తులో వరంగల్, ములుగు జిల్లాలోని రామప్ప, లక్నవరం వంటి పర్యాటక ప్రాంతాలకు కూడా హెలికాప్టర్ సేవలను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీంతో తెలంగాణ పర్యాటకం దేశ పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.