- నిరుడు 75 కొత్త సెంటర్లు హైదరాబాద్‌లోనే.. బెంగళూరులో 45 మాత్రమే
- దేశంలోని మొత్తం జీసీసీల్లో 20 శాతం వాటా
- ఇతర సిటీలతో పోలిస్తే సౌలతులు ఎక్కువ.. ఖర్చు తక్కువ
- ఆఫీస్ రెంట్ స్క్వేర్ ఫీట్ రూ.55 నుంచి రూ.110 మాత్రమే
- కంపెనీలను ఆకర్షిస్తున్న ప్రభుత్వ పాలసీలు, కనెక్టివిటీ నెట్వర్క్
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు హైదరాబాద్ కేరాఫ్‌గా మారింది. ప్రపంచంలోని టాప్ సంస్థలు, ఫార్చూన్ 500 కంపెనీలు తమ జీసీసీలను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. జీసీసీలకు అడ్డాగా ఉన్న బెంగళూరును దాటేసి మరీ హైదరాబాద్ దూసుకెళ్తున్నది. అందుకు 2025లో రాష్ట్రంలో ఏర్పాటైన జీసీసీల సంఖ్యే నిదర్శనం. నిరుడు (2025లో) దేశంలో 180 జీసీసీలు ఏర్పాటైతే ఒక్క హైదరాబాద్‌లోనే 75 ఏర్పాటయ్యాయి. అంటే దేశంలో ఏర్పాటైన జీసీసీల్లో 41 శాతం కంపెనీలు హైదరాబాద్‌నే తమ గమ్యస్థానంగా ఎంచుకున్నాయి.
అదే సమయంలో బెంగళూరులో 45 జీసీసీలు (25 శాతం) వచ్చాయి. మన సిటీలో ఏర్పాటైన 75 జీసీసీల్లో 35 కంపెనీలు ఫార్చూన్ 500లోనివే ఉండడం విశేషం. దీంతో మన టెక్ సిటీలో ఏర్పాటైన జీసీసీల సంఖ్య 400 దాటేసింది. దేశంలో ఉన్న జీసీసీల్లో హైదరాబాద్ సిటీ వాటా 20 శాతం. ప్రస్తుతానికి దాదాపు వెయ్యి జీసీసీలతో బెంగళూరు సిటీనే టాప్‌లో ఉన్నా.. అతి తొందర్లోనే బెంగళూరును హైదరాబాద్ దాటేసి జీసీసీలకు రారాజుగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అన్ని రంగాల జీసీసీలూ క్యూ కడుతున్నయ్..
జీసీసీల్లో అన్ని రంగాలకు చెందిన కంపెనీలూ హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫైనాన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, హెల్త్ కేర్ సెక్టార్లలో జీసీసీలు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయి. గూగుల్, అమెజాన్, జేపీ మోర్గాన్, మైక్రోసాఫ్ట్, నోవార్టిస్, యాపిల్, సనోఫీ, యాక్సెంచర్, డెలాయిట్, యూబీఎస్, హెచ్ఎస్బీసీ, వెల్స్‌ఫార్గో, మైక్రాన్, ఊబెర్, క్వాల్కమ్, పెప్సికో వంటి టాప్ సంస్థలు హైదరాబాద్‌లో తమ జీసీసీలను నెలకొల్పాయి.
ఇటీవలి కాలంలో యూబీఎస్ సిటీలో కొత్త జీసీసీని ఏర్పాటు చేసింది. 3 వేల మందికి ఉపాధి కల్పించనుంది. వాన్గార్డ్, లోంజా గ్రూప్, కోహిర్ హెల్త్, హెచ్‌సీఏ హెల్త్‌కేర్, డాజన్, సోనా టైప్ తదితర కంపెనీలు నిరుడు హైదరాబాద్‌ను డెస్టినేషన్‌గా ఎంచుకున్నాయి. మొత్తంగా సిటీలోని జీసీసీల ద్వారా 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఏఐ, ఫైనాన్స్‌కు చెందిన ఎక్కువ జీసీసీలు హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుతమున్న జీసీసీల్లో వీటి వాటానే 40 శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు.
హైదరాబాదే ఎందుకు..
2023 ముందు వరకు చాలా కంపెనీలు బెంగళూరును జీసీసీలకు అడ్రస్‌గా ఎంచుకునేవి. కానీ, నిరుడు నుంచి పరిస్థితి మారిపోయింది. ప్రతిభ కలిగిన యువతకు కొదవ లేకపోవడం, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం, ఆఫీస్ స్పేస్ ఖర్చు తక్కువగా ఉండడం, మౌలిక వసతులు మెరుగ్గా ఉండడం, ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్స్ రావడం వంటి అంశాలు.. కంపెనీలు హైదరాబాద్‌వైపే మొగ్గు చూపేలా చేస్తున్నాయి.
బెంగళూరు, ముంబై, పుణె వంటి సిటీలతో పోలిస్తే ఇక్కడ లివింగ్ కాస్ట్ తక్కువగా ఉండడం కూడా కలిసి వస్తున్నది. ఆయా సిటీల్లోని లివింగ్ కాస్ట్లో సగంతోనే ఇక్కడ మనగలగడం కూడా సంస్థలు ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి.
ట్యాలెంట్కు కొదవలేదు..
రాష్ట్రంలో నైపుణ్యాలు కలిగిన యువతకు కొదవ లేదు. అంతేకాదు.. యువతలోని నైపుణ్యాలను సానబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నది. ఏటా ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. దీంతో పలు జీసీసీలు ఇప్పటికే స్కూళ్లు, కాలేజీల్లోని యువతకు స్కిల్స్‌పై శిక్షణనూ ఇచ్చే ఏర్పాట్లు చేసుకున్నాయి.
గూగుల్, అమెజాన్ వంటి ప్రపంచంలోని అతిపెద్ద క్యాంపస్‌లు ఇక్కడే ఉండడంతో పాటు 700కిపైగా టాప్ టెక్ సంస్థలూ హైదరాబాద్‌లో కొలువుదీరడమూ జీసీసీలకు అనువుగా ఉంటున్నది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ (స్టెమ్) ఫౌండేషన్ పటిష్ఠంగా ఉండడమూ మనకు అనుకూలంగా ఉంటున్నది. ఐటీలో దాదాపు పది లక్షల మందికిపైగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు.
ప్రభుత్వ విధానాలు భేష్..
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీలు కూడా సంస్థలు మనవైపు చూసేలా చేస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. టీఎస్ఐపాస్ వంటి ఆన్లైన్ రెగ్యులేటరీ విధానాలు, సులభతర అనుమతులతో జీసీసీలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ఇండస్ట్రియల్ భూములకు స్టాంప్‌డ్యూటీలో పూర్తి మినహాయింపులు, సిబ్బంది శిక్షణకు పూర్తి రీయింబర్స్మెంట్, ఐదేండ్ల పాటు ఒక యూనిట్ కరెంట్‌కు రూపాయి తగ్గింపు వంటి విధానాలపట్ల కూడా జీసీసీలు హైదరాబాద్ సిటీకి ఆకర్షితమవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
ఖర్చు తక్కువ.. వసతులు ఎక్కువ..
హైదరాబాద్ సిటీని అందరి సిటీ అని పిలుస్తుంటారు. పేదల నుంచి పెద్దోళ్ల వరకూ మన సిటీలో బతకగలుగుతున్నారు. దానికి కారణం ఇక్కడి తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగే కారణం. ఇదే అంశం జీసీసీలు ఇటువైపు చూసేలా చేస్తున్నది. ఆఫీస్ స్పేస్ రెంట్లు కూడా హైదరాబాద్‌లో చాలా తక్కువ.
ఒక్క స్క్వేర్ ఫీట్‌కు నెలకు రూ.55 నుంచి రూ.110 వరకే ఖర్చవుతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అంటే పది వేల స్క్వేర్ ఫీట్ల స్పేస్‌ను నెలకు కేవలం గరిష్ఠంగా రూ.11 లక్షల వరకే రెంట్ ఉంటున్నది. ఇది బెంగళూరు, ముంబైలతో పోలిస్తే సగానికి సగం తక్కువ. ఉద్యోగులకు ఇచ్చే జీతాల ఖర్చు కంపెనీలకు కలసి వస్తున్నట్టు చెబుతున్నారు.
యూరప్, లాటిన్ అమెరికా దేశాలలో పోలిస్తే ఇక్కడ జీతాలు 40 శాతం తక్కువంటున్నారు. అమెరికాతో పోలిస్తే 70 శాతం తక్కువని చెబుతున్నారు. వాటికి తోడు రాష్ట్రంలో కల్పిస్తున్న సౌలతులూ ఎక్కువే కావడం విశేషం. ఎయిర్పోర్ట్, మెట్రో, రైల్వే నెట్వర్క్ వంటివి కనెక్టివిటీని పెంచుతున్నాయి.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఏటా 4.5 కోట్ల మంది ప్రయాణాలు చేసేలా విస్తరించేందుకు ఇప్పటికే కసరత్తులు జరుగుతున్నాయి. ఎయిర్‌పోర్టుకు, ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రోనూ విస్తరిస్తున్నారు. వాటికితోడు ఓఆర్ఆర్తో అన్ని ప్రాంతాలకూ చాలా తక్కువ టైంలో ప్రయాణాలు చేస్తుండడమూ కలిసి వస్తున్నది.

