పద్మారావునగర్, వెలుగు: బేగంపేట పరిధిలో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం భారీగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ (టింటెడ్ గ్లాస్) పెట్టుకున్న 150 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, అక్కడికక్కడే ఆ ఫిల్మ్‌లను తొలగించారు. రసూల్‌పురా, సీటీఓ జంక్షన్, బోయిన్‌పల్లి వంటి ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాల్లో బ్లాక్ ఫిల్మ్‌తో పాటు నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనాలు, అతిగా శబ్దం చేసే సైలెన్సర్లు, రాంగ్ సైడ్ డ్రైవింగ్, లైసెన్స్ లేని వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఏసీపీ శంకర్ రాజ్, ఇన్స్పెక్టర్ జానకి రాముడు వాహనదారులను హెచ్చరించారు.

