- హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ పీఎస్ పరిధిలో ఘటన
ఎల్బీనగర్/గొల్లపల్లి, వెలుగు : అటెండెన్స్ ఫీజు రూ. 5 వేలు చెల్లించకపోవడంతో హాల్‌టికెట్ ఇచ్చేందుకు కాలేజీ యాజమాన్యం నిరాకరించగా.. మనస్తాపానికి గురైన బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ పీఎస్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన మ్యాదరి రమేశ్, మౌనిక దంపతులు పిల్లలతో కలిసి హయత్‌నగర్‌లో ఉంటున్నారు. వీరి కుమారుడు ప్రణీత్ కుమార్ (21) ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.
మంగళవారం నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రణీత్‌కుమార్ అటెండెన్స్ తక్కువగా ఉందని రూ. 5 వేలు కడితేనే హాల్‌టికెట్ ఇస్తానని కాలేజీ ఏవో కృష్ణమూర్తి స్పష్టం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రణీత్ శనివారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు హయత్‌నగర్ ఇన్స్‌పెక్టర్ నాగరాజుగౌడ్ తెలిపారు. కాగా, ఫీజు కోసం కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తీసుకురావడం, హాల్‌టికెట్ ఇవ్వకపోవడం వల్లే ప్రణీత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రణీత్ మృతదేహంతో కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

