కాంగ్రెస్ మేనిఫెస్టో : గ్రేటర్ హైదరాబాద్ హామీలు.. కొత్త మెట్రో, మంచినీళ్లు ఫ్రీ

కాంగ్రెస్ మేనిఫెస్టో : గ్రేటర్ హైదరాబాద్ హామీలు.. కొత్త మెట్రో, మంచినీళ్లు ఫ్రీ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేసింది. నవంబర్ 17వ తేదీన హైదరాబాద్ పార్టీ ఆఫీసులో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే చేతుల మీదుగా విడుదల అయ్యింది. కాంగ్రెస్ మెనిఫెస్టోలో గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి చాలా కీలక హామీలు ఇవ్వటం జరిగింది. 

  • గ్రేటర్ హైదరాబాద్ తో సహా తెలంగాణలోని అన్ని నగరాలు, మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి 25 వేల లీటర్ల మంచినీటి ఉచితం ఇస్తామని స్పష్టం చేసింది కాంగ్రెస్. 
  • ఎల్బీనగర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు వయా అరాంఘర్, మెహదీపట్నం, గచ్చిబౌలి మీదుగా కొత్త మెట్రో లైన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది పార్టీ. 
  • సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లను కలుపుతూ స్కైవాక్ లు నిర్మిస్తామని వెల్లడించింది. 
  • హైదరాబాద్ లో పార్కింగ్ సమస్య అధిగమించేందుకు పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మాణం చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.
  • బస్తీల్లో పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చింది.
  • సెట్విన్ బస్సుల విస్తరణతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
  • ఉస్మానియా ఆస్పత్రిని హెరిటేజ్ గా గుర్తించి పూర్తి స్థాయిలో ఆధునీకరించి పూర్వ వైభవాన్ని తీసుకు వస్తామని చెప్పింది.
  • గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు అధునాతన మెటర్నిటీ ఆస్పత్రుల నిర్మాణం, రెండు అధునాతన ఈఎన్టీ ఆస్పత్రులు, రెండు అధునాతన సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు మేనిఫెస్టోలో వివరించింది కాంగ్రెస్ పార్టీ.
  • హైదరాబాద్ సిటీని ముంపు రహితంగా తీర్చిదిద్దే నాలాల ఆధునీకరణ చేపట్టనున్నట్లు హామీ ఇచ్చింది.
  • గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని మురికివాడల్లోని పేదలకు నీరు, విద్యుత్, డ్రైనేజీ, విద్య, ఆరోగ్యం వంటి నాణ్యమైన ప్రాథమిక సేవలతోపాటు సబ్సిడీతో కూడిన సర్వీస్ కార్డులు, ఆరోగ్య కార్డులు అందిస్తామని హామీ ఇచ్చింది.
  • హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఆస్తి పన్ను, ఇంటి పన్ను బకాయిలపై ఉన్న జరిమానాలను రద్దు చేయనున్నట్లు హామీ ఇచ్చింది. 
  • తెల్ల రేషన్ కార్డు ఉన్న యజమానులకు ఇంటి పన్ను తగ్గింపు

హైదరాబాద్ విజన్ 2030 పేరుతో తన మేనిఫెస్టోలో ఈ హామీలు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.