రూ. 30 వేల పాకెట్మనీ ఇవ్వాలంటూ భర్తపై భార్య వేధింపులు

రూ. 30 వేల పాకెట్మనీ ఇవ్వాలంటూ భర్తపై భార్య వేధింపులు
  • ఆపై రూ.2 కోట్ల నగలతో పరార్
  • విడాకులు ఇవ్వాలంటే మళ్లీ డబ్బులు డిమాండ్
  • కోర్టు ఆదేశాలతో బంజారాహిల్స్ పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేసు నమోదు

జూబ్లీహిల్స్, వెలుగు: ఓ వ్యక్తికి భార్య నుంచి ఎదురవుతున్న శారీరక, మానసిక వేధింపులపై కోర్టు ఆదేశాలతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.12లో నివసిస్తున్న కోనేరు ప్రఫుల్ (32), వేలగపూడి మానస్విత (29) దంపతులు. వివాహం జరిగిన కొద్దిరోజులకే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. వైవాహిక సంబంధాలకు నిరాకరించడమే కాకుండా, ప్రతి నెలా రూ. 30,000 పాకెట్ మనీ ఇవ్వాలని మానస్విత తనను వేధిస్తున్నట్లు ప్రఫుల్ ఆరోపించారు.

తప్పుడు కేసులు పెడతానని బెదిరిస్తూ పలుమార్లు భౌతిక దాడులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. 2025 నవంబర్ 22న ఇంటి నుంచి వెళ్తూ సుమారు రూ. 2 కోట్లకు పైగా విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు తీసుకెళ్లిందని తెలిపారు. వాటిని తిరిగి ఇవ్వకుండా విడాకుల కోసం డబ్బు డిమాండ్ చేస్తూ ప్రాణహాని తలపెడుతోందని ఆరోపించారు. ఈ విషయమై ప్రఫుల్ మొదట పోలీసులను ఆశ్రయించగా, వారు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు ఆదేశాలతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.