- గోవాలో కేంద్ర మంత్రి షెకావత్ చేతుల మీదుగా
- అవార్డు అందుకున్న మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: 'ఇండియా టుడే టూరిజం అవార్డ్స్-2026'లో భాగంగా హైదరాబాద్‌కు 'నేషనల్ కలినరీ డెస్టినేషన్' (ఉత్తమ ఆహార పర్యాటక కేంద్రం) అవార్డు వరించింది. సోమవారం గోవాలో జరిగిన ఇండియా టుడే టూరిజం సమ్మిట్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ అవార్డును అందుకున్నారు. కార్యక్రమానికి టూరిజం సంస్థ ఎండీ గౌతమి హాజరయ్యారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు లభించిన ఈ గౌరవం నగరానికి ఉన్న గొప్ప ఆహార వారసత్వానికి, తెలంగాణ పర్యాటక రంగం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనమన్నారు.
హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ చాయ్, తెలంగాణ సంప్రదాయ వంటకాలు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఈ అవార్డు నగర ఖ్యాతిని మరింత పెంచిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ పర్యాటక కేంద్రాలు, ఎకో-టూరిజం సర్క్యూట్లు, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు, అడ్వెంచర్ టూరిజం గమ్యస్థానాలు, సాంస్కృతిక ఆకర్షణలను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఇండియా టుడే గ్రూప్ చైర్మన్ అండ్ ఎడిటర్-ఇన్-చీఫ్ అరుణ్ పూరీ, ఇండియా టుడే గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ రాజ్ చెంగప్ప పాల్గొన్నారు.
