డేటింగ్ యాప్లో పరిచయం..రూ.1.47 లక్షల మోసం

డేటింగ్ యాప్లో పరిచయం..రూ.1.47 లక్షల మోసం

జూబ్లీహిల్స్ , వెలుగు: ఆన్​లైన్ డేటింగ్ యాప్​లో పరిచయం పెంచుకుని, ప్రేమ పేరుతో ఓ మహిళను కేటుగాడు మోసం చేశాడు. బంజారాహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం.. సుఖ్​దేవ్ నగర్​కు చెందిన ఆర్తి (39) అనే మహిళ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్​గా పనిచేస్తోంది. ఈమెకు ‘ఐల్’ అనే డేటింగ్ యాప్​లో  అలెశాండ్రో గియోవన్నీ అలియాస్ రమేశ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. విదేశీయుడిగా నాటకమాడి, కొంతకాలం చాటింగ్‌‌ చేసి ఆమె నమ్మకాన్ని సంపాదించాడు. తాను ఇండియాకు వస్తున్నానని నమ్మబలికాడు.

ఆ తర్వాత ముంబై ఎయిర్​పోర్టులో కస్టమ్స్ అధికారులు తనను ఆపారని, రిజిస్ట్రేషన్ ఇతర చార్జీల కోసం డబ్బులు కావాలని బాధితురాలిని కోరాడు. అతడి మాటలు నిజమేనని నమ్మిన ఆమె.. జునైద్ పేరిట ఉన్న బ్యాంక్ అకౌంట్​కు రెండు విడతల్లో  రూ.1,47,400 బదిలీ చేసింది. డబ్బులు అందిన తర్వాత నిందితుడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన ఆర్తి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.