వరల్డ్స్ ఫాస్టెస్ట్ హూమన్ కాలిక్యులేటర్‌గా హైదరాబాద్ యువకుడు

వరల్డ్స్ ఫాస్టెస్ట్ హూమన్ కాలిక్యులేటర్‌గా హైదరాబాద్ యువకుడు

శకుంతల దేవి.. ఆమె లెక్కల్లో దిట్ట. ఎటువంటి గణాంకాలనైనా సెకన్లలో పూర్తి చేస్తుంది. అందుకే ఆమె జీవితచరిత్రను బయోపిక్ గా తీశారు. సరిగ్గా ఆమెలాగే హైదరాబాద్ కు చెందిన 20 ఏళ్ల యువకుడు ఇప్పుడు వరల్డ్స్ ఫాస్టెస్ట్ హూమన్ కాలిక్యులేటర్‌గా ఎంపికయ్యాడు. లండన్‌లో జరిగిన మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్‌లో అతను మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ (ఎంసిడబ్ల్యుసి)ను గెలుచుకున్నాడు. మైండ్ స్పోర్ట్ ఒలింపియాడ్‌ను 1998 నుంచి నిర్వహిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా హైదరాబాద్ కు చెందిన నీల్‌కాంత్ భాను ప్రకాశ్ నిలిచాడు. అంతేకాకుండా.. ఈ టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగానూ నీల్‌కాంత్ చరిత్ర సృష్టించాడు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుతోన్న భాను ప్రకాశ్.. లండన్‌లో ఈ వారం జరిగిన మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్‌లో పాల్గొని మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్నాడు.

ఆన్ లైన్ ద్వారా జరిగిన ఈ పోటీలో యూకే, జర్మనీ, యూఏఈ, ఫ్రాన్స్, గ్రీస్, లెబనాన్ సహా 13 దేశాలకు చెందిన 13 నుంచి 50 ఏళ్లలోపు వయసు గల 30 మంది పాల్గొన్నారు. మొత్తం 65 పాయింట్లతో ఈ పోటీల్లో భాను తొలిస్థానంలో నిలవడం విశేషం. లెబనాన్, యూఏఈకి చెందిన యువకులు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

భాను ప్రకాశ్ ఇటువంటి రికార్డులు సాధించడం కొత్తేమీ కాదు. ఐదేళ్ల వయసులోనే సిప్ (SIP) అబాకస్ లో పేరు నమోదుచేసుకుని తొమ్మిది దశలను పూర్తిచేశాడు. అలాగే SIP అకాడమీ ఇచ్చిన అవకాశంతో.. ఇంటర్నేషనల్ అబాకస్ ఛాంపియన్ 13 మరియు నేషనల్ అబాకస్ ఛాంపియన్ 11, 12 టైటిళ్లను కూడా గెలుచుకున్నాడు.

గణితాన్ని ఒక క్రీడగా భావించి ప్రోత్సహించాలని భాను అంటున్నారు. ‘పిల్లలు లెక్కలంటే భయాన్ని పెంచుకుంటారు. వారిలో ఆ భయం పోవాలంటే అంకెలతో ఆడటం నేర్పించాలి. సంఖ్యలతో ఆడటం నిజంగా సరదాగా ఉంటుంది. దేశంలో చాలామంది తెలివిగల అధ్యాపకులున్నారు. లెక్కల్లో దేశానికి గత వైభవాన్ని తిరిగి తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పడు మనం చాలా మంది మానసిక అంకగణితంలో రాణించడానికి సహాయపడాలి’ అని భాను ప్రకాశ్ తెలిపాడు.

ప్రస్తుతం భానుప్రకాశ్.. ‘ఎక్స్‌ప్లోరింగ్ ఇన్‌ఫినిటీస్’అనే స్టార్ట్-అప్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు. ఈ స్టార్ట్ అప్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలలో లెక్కలు చేయడంలో వేగం మరియు మానసిక సామర్థ్యాలను పెంపొందించడమే అతని లక్ష్యం.

For More News..

అందుబాటులోకి టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

షూటింగులకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

ప్రభాస్ కు సారీ చెప్పి.. గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిన సాయిధరమ్ తేజ్

దేశంలో 30 లక్షలు దాటిన కరోనా కేసులు