సరోగసీ అయితే 40 లక్షలు గుంజొచ్చని!.సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రత ప్లాన్

సరోగసీ అయితే  40 లక్షలు గుంజొచ్చని!.సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రత ప్లాన్
  • సృష్టి టెస్ట్​ ట్యూబ్​ బేబీ సెంటర్ డాక్టర్ ​నమ్రత ప్లాన్​
  • రిమాండ్​ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి

సికింద్రాబాద్/ పద్మారావునగర్ వెలుగు: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సరోగసి, ఐవీఎఫ్ అక్రమాల కేసులో అరెస్టయిన ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్ర త రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను పేర్కొన్నట్లు సమాచారం. సంతానం లేని దంపతులు ఐవీఎఫ్ కోసం దవాఖానకు వస్తే వారిని డాక్టర్ నమ్రత సరోగసి వైపు మళ్లించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని డాక్టర్ నమృత ఒప్పుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ఐవీఎఫ్ కు రూ. ఒకటి..రెండు లక్షలు మాత్రమే వస్తాయని..అదే సరోగసీ అయితే రూ. 30 నుంచి రూ.40 లక్షలు వస్తాయనే దుర్బుద్ధితో  నమ్రత ఈ దారుణాలకు ఒడిగట్టారు. చాలా కేసుల్లో సరోగసీ చేయకుండానే పేద, మధ్య తరగతి దంపతుల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా తీసుకొని వారికి ఎంతో కొంత చెల్లించి వాళ్ల పిల్లలను సంతానం లేని దంపతులకు సరోగసీ పేరుతో అంటగట్టినట్లు సమాచారం. సరోగసీ చేయకుండానే చేసినట్లుగా నమ్మించి మోసం చేసినట్లు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇలా రూ. కోట్లు సంపాదించింది. ఈ ప్రక్రియలో డాక్టర్ నమ్రతకు గాంధీ దవాఖాన అనస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సదానందం సహకరించినట్లు సమాచారం. 

సృష్టికి ఆంధ్రాలో ఏఎన్ఎంల సహకారం

సరోగసీ చేశామని చెప్పి గిరిజన ప్రాంతాల నుంచి శిశువులను తీసుకువచ్చి ఇచ్చేదని, ఈ విషయంలో డాక్టర్ ​నమ్రత ఏపీ​లోని కొంతమంది ఏఎన్ఎం టీచర్లు సహాయం తీసుకుందని తెలిసింది. ఆ రాష్ట్రంలోని గిరి జన ప్రాంతాల్లో ఎవరైనా గర్భందాల్చగానే వారి గురించి తెలుసుకునే ఏఎన్ఎంలు డెలివరీ తర్వాత పిల్లల్ని తీసుకువచ్చి అప్పగించేవారని సమాచారం. ఎంత మందిని తీసుకువస్తే ఆ స్థాయిలోనే నజరానాలు, నగదు బహుమతులు ఇచ్చేవారని తెలిసింది. చాలావరకు తెలిసే తప్పులు చేశామని డాక్టర్​నమ్రత ఒప్పుకున్నట్టు రిమాండ్ ​రిపోర్టులో పేర్కొన్నారు. రాజ స్తాన్ దంపతుల కేసులో సరోగసీ చేయకపోయినా చేసినట్లు నమ్మించిందని, వారు డీఎన్ఏ పరీక్షల రిపోర్ట్స్​కావాలని అడగడంతో జాప్యం చేస్తూ తప్పించుకోవాలని చూసిందని వివరించారు. కానీ వారే డీఎన్​ఏ టెస్ట్​చేయించుకోవడంతో అసలు నిజం బయటపడింది.

ఐదు రోజుల కస్టడీకి డాక్టర్​ నమ్రత

నకిలీ సరోగసీ, ఐవీఎఫ్, శిశువుల అక్రమ రవాణా తదితర కేసుల్లో ప్రధాన నిందితురాలు, సృష్టి టెస్ట్ ట్యూబ్​సెంటర్​ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఆమెను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు పదో అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ గురువారం తీర్పు వెల్లడించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మరింత సమాచారాన్ని రాబట్టాలనే ఉద్దేశంతో పోలీసులు ఆమెను కస్టడీకి తీసుకోనున్నారు. శుక్రవారం ఉదయం చంచల్​గూడ జైలు నుంచి పోలీసులు డాక్టర్ నమ్రతను కస్డడీలోకి తీసుకొని, విచారణ జరపనున్నారు. ఇప్పటికే ఆమె అడిగే ప్రశ్నలకు సంబందించిన ప్రశ్నావళిని పోలీసులు సిద్దం చేసినట్టు సమాచారం.