
- ఆన్‌లైన్‌లో చూసి డ్రగ్ చాక్లెట్లు చేసిండు
- బ్రాండెడ్ కంపెనీల ఫ్లేవర్స్ వాడకం
- ‘ఎడిబుల్’ పేరుతో మార్కెటింగ్
- ఆన్‌లైన్‌లో ఆర్డర్స్.. యాప్స్‌తో డోర్ డెలివరీ
- పేరెంట్స్ ఫార్మా బిజినెస్.. కొడుకు హాష్ చాక్లెట్స్ దందా
- సీవీ ఆనంద్ వివరాలు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాజేంద్రనగర్ నార్సింగి అడ్డాగా గంజాయి నూనె (హాష్ ఆయిల్)తో డ్రగ్ చాక్లెట్స్ దందాను హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్‌న్యూ) పోలీసులు గుట్టురట్టు చేశారు. ప్రముఖ ఫార్మా కంపెనీకి చెందిన వారి కొడుకు రిషి సంజయ్ మెహతా (22)ను శనివారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 48 హాష్ ఆయిల్ చాక్లెట్ బార్స్, 40 గ్రాముల హాష్ ఆయిల్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రిషి కస్టమర్ల లిస్ట్‌లో కాలేజ్, స్కూల్ స్టూడెంట్స్ ఉన్నట్లు సమాచారం. కేసు వివరాలను సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
పేరెంట్స్ కళ్లుగప్పి
రాజేంద్రనగర్ నార్సింగికి చెందిన రిషి సంజయ్.. ఫోనిక్స్ యూనివర్సిటీలో ఆన్‌లైన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నాడు. అతని పేరెంట్స్ ఫార్మా కంపెనీ నిర్వహిస్తున్నారు. కాలేజీలో చదివే రోజుల్లోనే రిషి డ్రగ్స్, గంజాయికి అలవాటుపడ్డాడు. ఈ–సిగరెట్స్‌లో డ్రగ్స్ లేయర్‌గా పూసి సేల్ చేశాడు. లాభాలు ఎక్కువగా రాకపోవడంతో గంజాయి చాక్లెట్స్ సప్లయ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఆన్‌లైన్‌లో చూసి చాక్లెట్స్ తయారు చేయడం నేర్చుకున్నాడు. విశాఖ ఏజెన్సీ ఏరియాలోని రామారావు అనే వ్యక్తి నుంచి హాష్ ఆయిల్ కొనుగోలు చేసేవాడు. హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ యాదవ్, రోహిత్ కూడా హాష్ ఆయిల్ సప్లై చేసేవారు. పేరెంట్స్‌కి తెలియకుండా ఇంట్లోనే హాష్ ఆయిల్ చాక్లెట్ తయారు చేయడం ప్రారంభించాడు.
బ్రాండెడ్ ఫ్లేవర్స్.. ఇంట్లోనే డెన్
ప్రముఖ చాక్లెట్ కంపెనీలకు చెందిన ఫ్లేవర్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవాడు. చాక్లెట్ కలర్ వచ్చేలా ఓరియో, కిట్‌కాట్, క్యాడ్‌బరీ సహా చాక్లెట్స్ బార్స్‌ను తయారు చేశాడు. 4 కేజీల చాక్లెట్ పదార్థాలకు 40 గ్రాముల హాష్ ఆయిల్ కలిపి 15 స్టిప్స్‌తో చాక్లెట్ బార్ తయారు చేసేవాడు. ఒక్కో బార్‌ను డిమాండ్‌ను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు సేల్ చేసేవాడు. ఎడిబుల్ చాక్లెట్స్ పేరుతో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశాడు. స్నాప్‌చాట్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫ్రెండ్స్‌తో కాంటాక్ట్ అయ్యేవాడు. ఆర్డర్స్ తీసుకుని ర్యాపిడో, ఉబెర్ సహా ఇతర డోర్ డెలివరీ సర్వీసెస్‌తో సప్లై చేసేవాడు. గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా అమౌంట్ తీసుకునేవాడు.
ఇలా దొరికాడు
ముషీరాబాద్, బోయిన్‌పల్లి పీఎస్ లిమిట్స్‌లో నమోదైన హాష్ ఆయిల్ కేసుల్లో హెచ్‌న్యూ పోలీసులు దర్యాప్తు చేశారు. విశాఖ నుంచి హాష్ ఆయిల్ సప్లయ్ చేస్తున్న బోనాల వినోద్, శ్రీకాంత్ యాదవ్, రోహిత్‌లను సెప్టెంబర్‌లో అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారంతో నార్సింగిలోని రిషి సంజయ్ మెహతాపై నిఘా పెట్టారు. పక్కా ప్లాన్ ప్రకారం.. శనివారం అరెస్ట్ చేశారు. రిషి కస్టమర్స్ లిస్ట్‌లో 18 నుంచి 25ఏండ్ల స్టూడెంట్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో 50శాతం మంది అమ్మాయిలే ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. పార్టీలు, బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో డ్రగ్ చాక్లెట్స్ ఎక్కువగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. బానిసలైన స్టూడెంట్స్‌ను గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తామని, అన్ని కాలేజీల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు.