- హైడ్రా చీఫ్ రంగనాథ్ వెల్లడి
దిల్ సుఖ్ నగర్, వెలుగు: సరూర్ నగర్ చెరువును హైడ్రా పరిధిలోకి తీసుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బుధవారం సరూర్నగర్ చెరువు, ప్రియదర్శిని పార్కును సందర్శించారు. సరూర్ నగర్ చెరువు విస్తీర్ణం, ప్రస్తుత పరిస్థితులు, మురుగు నీటి ప్రవాహం, ఎస్టీపీ ప్లాంట్ పనితీరు, ఇతర అంశాలను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. సరూర్నగర్ చెరువు అసలు విస్తీర్ణం సుమారు 150 ఎకరాలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 90 ఎకరాలకు పరిమితమైందన్నారు.
ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే మార్చి నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, ఏడాది కాలంలో సరూర్ నగర్ చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి, గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, హైడ్రా అధికారులు, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.
కటోరా హౌజ్ పరిరక్షణకు సహకరిస్తం
మెహిదీపట్నం/ఉప్పల్: గోల్కొండ కోట ప్రాంగణంలోని కటోరా హౌజ్ పరిరక్షణకు హైడ్రా పూర్తి సహకారం అందిస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 450 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ నీటి వనరును కాపాడేందుకు నిర్మాణ్ ఎన్జీవో ముందుకు రావడం సంతోషకరమన్నారు. కేంద్ర ఆర్కియాలజీ శాఖ సంరక్షణలో ఉన్న ఈ చెరువును హైడ్రా కమిషనర్ బుధవారం సందర్శించారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు.
ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ, రామంతాపూర్ పెద్దచెరువు, చిన్నచెరువుల్లో గుర్రపుడెక్కను తొలగించడంతోపాటు చెరువులను సుందరీకరించాలని హైడ్రా కమిషనర్ ను ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి వినతిపత్రం ఇచ్చారు.
