చెంగిచర్లలో హైడ్రా ఫెన్సింగ్ లొల్లి

చెంగిచర్లలో హైడ్రా ఫెన్సింగ్ లొల్లి
  • అది ప్రైవేటు స్థలం : డీసీ  –  కమ్యూనిటీ స్థలాన్ని ఆక్రమిస్తున్నందుకే ఫెన్సింగ్​ : హైడ్రా

మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి పరిధిలో చెంగిచెర్ల సర్వే నెంబర్130 జయప్రద కాలనీలో హైడ్రా ఫెన్సింగ్​వేయడం వివాదానికి కారణమైంది. అయితే, దీనిపై బోడుప్పల్ డిప్యూటీ కమిషన్​శైలజ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ రికార్డుల ప్రకారం.. హైడ్రా ఫెన్సింగ్​వేసిన భూమి ప్రైవేట్​స్థలమని స్పష్టం చేశారు. తమకు సమాచారం ఇవ్వలేదని, విషయం తెలుసుకుని ఫెన్సింగ్ వేస్తున్న హైడ్రా ఆఫీసర్లకు కాల్​చేస్తే స్పందించలేదన్నారు. ఈ విషయాన్ని హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. స్థల యజమాని హమాలీ శ్రీనివాస్ మాట్లాడుతూ హైడ్రా కంచె వేసిన స్థలం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సహా అన్ని రికార్డుల్లో ప్రైవేటు ప్లాట్‌‌గానే నమోదై ఉందన్నారు. 

కమ్యూనిటీ భూమి ఆక్రమణకు యత్నం.. అందుకే..

కమ్యూనిటీకి చెందిన భూమిని ఒక్కరే ఆక్రమించాలని చూస్తున్నారని ఫిర్యాదు వచ్చిందని, అందుకే ఫెన్సింగ్ వేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది. భూమిని కాపాడేందుకు ఇదివరకే బోర్డులు పెట్టినా వాటిని తొలగించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారన్నారు. నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారన్న దానిపై కూడా విచారణ జరుగుతోందన్నారు. భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. కమ్యూనిటీ తరపున భూమిని కమర్షియల్ పర్పస్ లో వదిలేయగా, మున్సిపల్ అనుమతులిస్తే కమర్షియల్ పర్పస్ లో ఇవ్వాలి గానీ, రెసిడెన్షియల్ పర్మిషన్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.