923 ఎకరాల భూములు కాపాడినం ! వాటి విలువ రూ.50 వేల కోట్ల పైనే: హైడ్రా కమిషనర్ రంగనాథ్

923 ఎకరాల భూములు కాపాడినం ! వాటి విలువ రూ.50 వేల కోట్ల పైనే: హైడ్రా కమిషనర్ రంగనాథ్
  • గాజులరామారంలో కబ్జాలో రౌడీ షీటర్లు, పొలిటికల్ లీడర్లు
  • తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతోనే ఇబ్బందులు
  • డీఆర్ఎఫ్ టీమ్స్ మరిన్ని పెంచాలని ప్రభుత్వాన్ని కోరాం
  • రాబోయే 100 ఏండ్లకు తగ్గట్టుగా నాలా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడి

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆధ్వర్యంలో 96 ప్రాంతాల్లో ఆపరేషన్స్ నిర్వహించి.. 923 ఎకరాల భూములను కాపాడామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. హైడ్రా కాపాడిన భూముల విలువ దాదాపు రూ.45 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లపైనే ఉంటుందని చెప్పారు. సోమవారం హైడ్రా ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రాపై సోషల్ మీడియాలో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు అప్రమతంగా ఉండాలన్నారు. వర్టెక్స్, వాసవి విషయంలో హైడ్రా కుమ్మకైందని చాలామంది అంటున్నారని.. హైడ్రాపై ఎక్కడైనా ఎంక్వయిరీ చేసుకోవచ్చని ఆయన  సూచించారు. కాల్ డేటా తీస్తే నిజాలు బయటకు వస్తాయని అభిప్రాయపడ్డారు. వర్టెక్స్ సంస్థపై మొదట కేసు పెట్టింది హైడ్రానే అని, ముసాపేట్ లో నాలా ఆక్రమిస్తే వాసవి సంస్థపై కూడా కేసు పెట్టామన్నారు. కబ్జాలు తొలగించే సమయంలో కొందరు చిన్న పిల్లలతో వీడియోలు తీసి ట్రోల్ చేస్తున్నారని, ఆక్రమణల వెనుక ఎక్కడ కూడా పేదలు లేరని, అంతా బడా బాబులే ఉన్నారని, పేదలను పెట్టి ఆక్రమిస్తున్నారన్నారు. ఆదివారం గాజులరామారంలో కబ్జాలో ఉన్న నిర్మాణాలు కూల్చివేశామని, కొందరు స్థానిక రౌడీ షీటర్లు, పొలిటికల్ లీడర్లు కబ్జా చేసి, చిన్న చిన్న గదులు నిర్మించి అందులో పేదవారిని ఉంచే ప్రయత్నం చేశారన్నారు.

గతంలో రెవెన్యూ అధికారులు అనేక సార్లు నోటీసులు ఇచ్చారని.. అయినా ఆక్రమణలు ఆగలేదన్నారు. అందులో కేవలం ఖాళీగా ఉన్న ఇండ్లను మాత్రమే కూల్చామని, 621 ఇండ్లల్లో ప్రజలు ఉండడంతో ఆ ఇండ్లను కూల్చలేదన్నారు. ఇక్కడ పేదలకు ఎదురు డబ్బులు ఇస్తూ ఆ ఇండ్లలో ఉంచుతున్నారని చెప్పారు. కొందరు డబ్బులు పెట్టి కొన్న వాళ్లు కూడా ఉన్నారని, వాళ్లు  ముందుకొచ్చి ఎవరి నుంచి కొన్నారో చెబితే.. వారికి న్యాయం చేయడానికి హైడ్రా సిద్ధంగా ఉందన్నారు. కబ్జా చేసిన పొలిటిషన్స్ పేర్లు గవర్నమెంట్ కి ఇచ్చామన్నారు. ఇక ఫాతిమా కాలేజ్ సల్కం చెరువు ప్రిలిమినరీ నోటిఫికేషన్ మాత్రమే వచ్చిందని, ఫైనల్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ పూర్తయ్యాక ఏం చేయాలో అప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆక్రమణలపై హైడ్రాకి 5వేల ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 75శాతం పరిష్కరించినట్టు తెలిపారు. పేదల జోలికి హైడ్రా పోదని.. పేదల పట్ల సానుకూలంగా ఉంటుందన్నారు. ఒకవేళ పేదల భూములు తప్పనిసరి తొలగించాల్సి వస్తే వారికి హైడ్రా న్యాయం చేస్తుందన్నారు. ఆక్రమణదారులు కావాలనే పేదలను పెట్టి కబ్జాలు చేస్తున్నారని రంగనాథ్​తెలిపారు. 

చెరువుల కబ్జా, నాలాల ఆక్రమణతోనే వరదలు..
హైదరాబాద్​సిటీలో క్లౌడ్ బరెస్ట్ జరుగుతోందని, తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురస్తుందని రంగనాథ్ తెలిపారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరడంతో నగరంలో సాయంత్రం సమయాల్లోనే తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతోందని వెల్లడించారు. ముంబై, ఢిల్లీ, గుర్గావ్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగి పేదలు నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. చెరువులన్నీ కబ్జాకు గురికావడం, నాలాలను ఆక్రమించడంతో వరదలు పెరుగుతున్నాయని తెలిపారు. చెరువులు, నాలాలను కాపాడే బాధ్యతపై యువకులు దృష్టి సారించాలని రంగనాథ్ పిలుపునిచ్చారు.

ఇటీవల కుత్బుల్లాపూర్ లో ఒక్కసారిగా 18 సెం.మీ. వర్షపాతం నమోదైందని, నగర శివారులో కన్నా నగరంలో ఎక్కువ ఎండ కొడుతున్నదని, ఎండ వల్ల జెనరేట్ అయిన హీట్ తో ఇక్కడ ఎక్కువ వర్షపాతం నమోదు అవుతున్నదన్నారు.  అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ తో ఇలాంటి ఫ్లడ్ ను కంట్రోల్ చేయవచ్చన్నారు. ఇందులో భాగంగా నాలాల పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని.. రాబోయే 100 ఏండ్లకు తగ్గట్టుగా నాలా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. నాలాల్లో డీ సిల్టింగ్ కూడా చాలా ముఖ్యమని.. ఇందుకోసం డీ సిల్టింగ్ కు హైడ్రా పెద్ద పీట వేయాలని నిర్ణయించిందన్నారు. నాలాల్లో మొన్న ముగ్గురు కొట్టుకుపోయారని, అందులో ఒక్కరి బాడీ వలిగొండలో దొరికిందని, మిగతా వారి కోసం హైడ్రా తీవ్రంగా శ్రమించిందన్నారు. ఫ్లోటింగ్ ఎక్కువ గా ఉండడంతో ఇంకా దొరకలేదన్నారు. నల్గొండ జిల్లాల్లోని ప్రాజెక్టుల గేట్లు కూడా తెరవడంతో ఎక్కడో ఓ చోట దొరికే అవకాశం ఉందన్నారు. 

మైత్రీవనంలో 20 లారీల పూడికతీత...
నాలాల్లో పూడిక తీత పనులు సైతం వేగంగా జరుగుతున్నాయని, మైత్రీవనంలో 20లారీల పూడిక తీశామని రంగనాథ్​చెప్పారు.24,653 క్యాచ్ పిట్స్ క్లీన్ చేశామని.. 3,193 నాలా ఆక్రమణలను తొలగించామని తెలిపారు.7,457 వాటర్ లాగింగ్ పాయింట్లను క్లీన్ చేశామని, నాలాల ఆక్రమణలను గుర్తించడానికి జీఐఎస్ విభాగం క్రియాశీలకంగా పనిచేస్తోందన్నారు.1,252 చెరువులు, కుంటలకు సంబంధించి మ్యాపింగ్ చేయడంతో 2,053 చదరపు కిలోమీటర్ల పరిధి పెరిగిందన్నారు. నాలా నెట్ వర్క్ మ్యాపింగ్ ద్వారా 4,932 ఆక్రమణలను గుర్తించామని తెలిపారు.

రూ.58.40 కోట్లతో ఆరు చెరువుల అభివృద్ధి..
చెరువుల పునరుద్ధరణపైనా దృష్టి సారించినట్టు హైడ్రా కమిషనర్​రంగనాథ్ తెలిపారు. బతుకమ్మకుంట తరహాలోనే సున్నం చెరువు, తమ్మిడికుంట, ఉప్పల్ నల్లచెరువు, భమృక్ ధౌలా, కూకట్ పల్లిలోని నల్లచెరువులను రూ.58.40 కోట్లతో పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. దీంతో 105 ఎకరాలున్న చెరువులు 180 ఎకరాలకు పెరుగుతున్నాయని తెలిపారు. బతుకమ్మకుంటను ఈ నెల 26న సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు చెప్పారు.

డీఆర్ఎఫ్ టీమ్ల పెంపునకు ప్రతిపాదనలు
హైదరాబాద్​సిటీలో భారీ వర్షాలు, వరదల సమయంలో డీఆర్ఎఫ్ టీమ్ లు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని రంగనాథ్​తెలిపారు. ప్రస్తుతం ఉన్న 51 బృందాలను 72కు పెంచడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ లో 2,250 మంది పనిచేస్తున్నారని తెలిపారు. 240 స్టాటిక్ టీమ్స్ పనిచేస్తున్నాయని వెల్లడించారు.