- ప్రజావాణితో మరింత పెరుగుతున్న సంఖ్య
- ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలిక బ్రేక్
- పెండింగ్ దరఖాస్తులు క్లియరెన్స్‌పై ఫోకస్
హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల సంరక్షణ, ఆక్రమణల తొలగింపు కోసం ప్రతి ప్రజావాణిలో కంప్లయింట్స్స్వీకరిస్తున్న హైడ్రా.. ఆ ఫిర్యాదులు- కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుండడంతో పాత దరఖాస్తులను పరిష్కరించే పనిలో పడింది. ప్రజావాణి, ఆన్లైన్, వాట్సాప్, ఫోన్ ఇన్ తదితర వేదికల ద్వారా ఏకంగా 35 వేలకు పైగా ఫిర్యాదులు రాగా, ప్రతి సోమవారం ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. దీంతో పాత కంప్లయింట్స్‌ను పరిష్కరించడానికి ప్రజావాణికి బ్రేక్ఇచ్చి మొత్తం సిబ్బంది పిర్యాదుల పరిశీలనలోనే నిమగ్నమయ్యారు.
10 రోజులుగా హైడ్రా కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు దాదాపు 300 మంది ఇదే పనిలోనే ఉన్నారు. ఇప్పటివరకు 15 వేల ఫిర్యాదులను పరిశీలించినట్టు తెలిసింది. వీటిలో హైడ్రా పరిధిలోకి వచ్చేవి? రానివి చూసి డివైడ్చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించినవి ఉంటే వెంటనే అక్కడికి పంపిస్తున్నారు. దీనివల్ల ఫిర్యాదుదారులకు త్వరగా సమాధానం లభించడమే కాకుండా, హైడ్రాపై పనిభారం తగ్గుతుందని భావిస్తున్నారు. మరికొన్ని ఫిర్యాదులు ఒకే సమస్యకి సంబంధించి పదుల సంఖ్యల్లో ఉన్నట్లు తెలిసింది.
20 రోజులు టార్గెట్
మిగిలిన ఫిర్యాదులను మరో 20 రోజుల్లోగా పూర్తిస్థాయిలో పరిశీలించాలని హైడ్రా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత, వచ్చే నెల 8 నుంచి ప్రజావాణిని తిరిగి స్టార్ట్ చేయాలని హైడ్రా కమిషనర్ నిర్ణయించారు. అప్పటివరకు సిబ్బంది ఎవరూ ఇతర పనుల్లో ఉండకుండా, కేవలం ఫిర్యాదుల క్లియరెన్స్‌కే పరిమితం కావాలని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి తిరిగి మొదలైన తర్వాత ఫిర్యాదులను స్వీకరించిన వారంలోపే అన్నింటినీ క్లోజ్ చేసేలా హైడ్రా ప్లాన్ చేస్తోంది.
