- ప్రభుత్వ భూమిలో రేకులు వేసి ఆక్రమణకు యత్నం
- జగద్గిరిగుట్టలో ఆలయాల పేరిట
- కమర్షియల్ కాంప్లెక్సుల దందా
- హైడ్రాకు స్థానికుల ఫిర్యాదు
- ప్రజావాణికి 56 కంప్లయింట్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ భూములు కాపాడాలంటూ హైడ్రా ప్రజావాణికి సోమవారం 56 ఫిర్యాదులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లిలో రెండు రోడ్లు కలిసే చోట ఉన్న ప్రభుత్వ భూమిలో రేకుల ప్రహారీ వేసి లోపల నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని ఐడీపీఎల్ కాలనీ నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే రూట్లో నాలాలపై నిర్మాణాలు చేపడుతున్నారని అక్కడి వారు కంప్లయింట్చేశారు.
జగద్గిరిగుట్టలోనే ఆలయాల పేరిట కమర్షియల్కాంప్లెక్స్కట్టి అద్దెకు ఇచ్చి రూ. లక్షలు కాజేస్తున్నారని మరికొందరు ఫిర్యాదు చేశారు. కీసర మండలం నాగారంలోని సర్వే నంబరు 83లో 18 ఎకరాల పాత లేఅవుట్‌ను చెరిపేసి 80 గజాల చొప్పున నోటరీ మీద స్థలాలు అమ్ముకుంటున్నారని, నాగారంలోనే 2.30 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందని కాపాడాలని కోరారు. ఉప్పల్ మండలంలోని మల్లాపూర్ సర్వే నంబరు 84లో దాదాపు 2 వేల గజాల ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలకు సిద్ధమవుతున్నారని ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంగ్ పేటలో మల్పప్పగారి కుంట 14 ఎకరాలుంటుందని.. చెరువు స్వరూపాన్ని మార్చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. పెద్ద అంబర్‌పేటలోని కుంట్లూరులో ప్రజయ్ గుల్‌మహర్ కాలనీ గేటెడ్ కమ్యూనిటీ కాకపోయినా రోడ్లకు అడ్డంగా ప్రహారీలు కట్టి పక్కనే ఉన్న కాలనీలకు దారి లేకుండా చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. చర్యలు తీసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
హౌసింగ్ శాఖలో 377 ఫిర్యాదులు
కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 478 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. హౌసింగ్ శాఖ కు సంబంధించి 377, పింఛన్ల కోసం 62, రెవెన్యూ శాఖకు 13, ఇతర శాఖలకు సంబంధించి 26 ఫిర్యాదులు అందాయన్నారు. అడిషనల్కలెక్టర్లు కదిరవన్ పలని, పీడీ హౌసింగ్ అశోక్ చక్రవర్తి, ఇన్చార్జి డీఆర్ఓ శ్రీధర్ దరఖాస్తులు స్వీకరించారు.
