- నీళ్లలో మాంజా చిక్కుకుని విలవిల్లాడిన చిన్ని ప్రాణం
- టార్చ్‌లు పట్టుకుని బోటులో వెళ్లి
- మాంజా తీసి కాపాడిన టీమ్
- హైడ్రాపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు
మల్కాజిగిరి, వెలుగు : సాటి మనిషి కండ్ల ముందే రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉన్నా పట్టించుకోని రోజులివి...కానీ, చైనా మాంజా చిక్కుకుని ఓ బాతు ప్రాణం ప్రమాదంలో ఉందని తెలుసుకున్న హైడ్రా టీమ్..సరుకు, సరంజామాతో తరలివెళ్లి దాని ప్రాణాలను కాపాడి సురక్షితంగా చెరువులో వదిలిపెట్టింది. ఒక ప్రాణం విలువ ఎంత గొప్పదో తెలియజేసే ఈ ఘటన జవహర్నగర్పరిధిలోని యాప్రాల్చెరువులో జరిగింది.
ఏమయ్యిందంటే..
జవహర్ నగర్ పరిధిలోని యాప్రాల్ చెరువు పక్కన మంగళవారం సాయంత్రం వాకింగ్చేస్తున్న కొంతమందికి చైనా మాంజా చిక్కుకుని విలవిలలాడుతున్న ఓ నీటి బాతు కనిపించింది. అది చెరువు లోపల ఉండడం, చీకటి పడుతుండడంతో వారికి లోపలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో వారు హైడ్రాకు ఫోన్‌చేశారు. విషయం తెలుసుకున్న హైడ్రా టీమ్ నుంచి ఎనిమిది మంది సిబ్బంది, ఎయిర్‌బోట్, ఇతర సామగ్రితో రాత్రి ఎనిమిది గంటల వేళ చెరువు వద్దకు చేరుకున్నారు. అప్పటికే చీకటి పడింది.
అయినా, నలుగురు సిబ్బంది ఎయిర్బోటు వేసుకుని టార్చిలైట్లతో చెరువు లోపలకు వెళ్లారు. మధ్యలో ఎటూ కదలకుండా తల్లడిల్లుతున్న బాతును పట్టుకుని పైకి తీయగా శరీరమంతా మాంజా చుట్టుకుని కనిపించింది. నీళ్లలోంచి దాన్ని బయటకు తీసి ఐదు నిమిషాల పాటు దాని శరీరానికి చుట్టుకున్న మాంజాను జాగ్రత్తగా కట్‌చేసి తీశారు.
తర్వాత బోటులో ఒడ్డుకు తీసుకువచ్చి గాయాలేమైనా అయ్యాయో పరిశీలించి తర్వాత మళ్లీ తీసుకువెళ్లి చెరువులో వదిలిపెట్టారు. రాత్రి అని కూడా చూడకుండా ఒక మూగజీవి ప్రాణం కాపాడడానికి కదిలివచ్చిన హైడ్రాను జంతు ప్రేమికులతో పాటు స్థానికులు అభినందించారు.
