హైదరాబాద్ లో 13 వందల 84 చెరువులుండే ..625 చెరువుల జాడ కనిపించట్లే: హైడ్రా చీఫ్ రంగనాథ్

హైదరాబాద్ లో 13 వందల 84 చెరువులుండే ..625 చెరువుల జాడ కనిపించట్లే: హైడ్రా చీఫ్ రంగనాథ్
  • మిగిలిన 759 ఆక్రమణల ముప్పులో ఉన్నయ్​
  • రక్షించడం, కనుమరుగైన చెరువుల పునరుద్ధరణే లక్ష్యం  

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఒకప్పుడు 1,384 చెరువులు ఉండగా, ప్రస్తుతం 625 చెరువుల జాడ కనిపించడం లేదని హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్ అన్నారు. మిగిలిన 759 చెరువులు కూడా ఆక్రమణల ముప్పులో ఉన్నాయని, వాటిని రక్షించడంతో పాటు కనుమరుగైన చెరువులను గుర్తించి పునరుద్ధరించడమే హైడ్రా ప్రధాన లక్ష్యమన్నారు. శుక్రవారం నగరంలోని ఓ కార్యక్రమంలో  పాల్గొన్న ఆయన  మట్లాడారు.  నగరంలో గొలుసుకట్టు చెరువులను కాపాడుకుంటూ, పర్యావరణహిత నగర నిర్మాణమే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతోందని  స్పష్టం చేశారు. 

రాబోయే పదేండ్లలో కనీసం 1300 చెరువులను పునరుద్ధరిస్తే  భూగర్భ జలాల స్థాయిని పెంచవచ్చని తెలిపారు. నగరం నలుమూలలా ట్యాంక్‌‌బండ్‌‌ వంటి వాతావరణం తీసుకురావాలనేది ప్రభుత్వ సంకల్పమని  పేర్కొన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా 6 చెరువులను అభివృద్ధి చేశామని, మరో 14 చెరువుల పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. అలాగే, 4 పెద్ద చెరువులను భారీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. మురుగుకూపాలుగా మారిన చెరువుల వద్ద పార్కులు, గ్రీనరీ, వాకింగ్ ట్రాక్‌‌లు, ఓపెన్ జిమ్‌‌లు, పిల్లల ఆటస్థలాలు ఏర్పాటు చేసి ఆహ్లాదకర పర్యాటక ప్రాంతాలుగా మారుస్తున్నామన్నారు. 

అంబర్‌‌పేట బతుకమ్మకుంట, కూకట్‌‌పల్లి నల్లచెరువు, పాతబస్తీలోని బమృకున్ ఉద్ దౌలా చెరువుల అభివృద్ధే దీనికి నిదర్శనమన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌‌లో సంభవించిన గాలివాన ఉపద్రవం పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లే జరిగిందని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

నగరంలో వరదలకు చెరువులు, నాలాల ఆక్రమణలే ప్రధాన కారణమని, అందుకే వరద కాలువల పునరుద్ధరణను పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. ప్యాట్నీ నాలా ఆక్రమణలను తొలగించడం ద్వారా పైన ఉన్న 20కి పైగా కాలనీలకు వరద ముప్పు తప్పించగలిగామని వివరించారు. డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్‌‌తో పాటు పర్యావరణ పరిరక్షణకు హైడ్రా నిరంతరం కృషి చేస్తుందని రంగనాథ్ స్పష్టం చేశారు.