హైదరాబాద్ సిటీ: హైడ్రా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 42 ఫిర్యాదులు అందాయి. హైడ్రా అడిషనల్ కమిషనర్ డి.ఆనంద్ కుమార్ వీటిని స్వీకరించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి–మూసాపేట సర్కిళ్ల పరిధిలో రూ.600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇక్కడ మొత్తం 10.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. అందులో 4 ఎకరాలను జలమండలికి కేటాయించారన్నారు.
మిగతా భూమిలో రెండెకరాలను పాఠశాలల నిర్మాణం కోసం విద్యాశాఖకు అప్పగించినప్పటికీ నిర్మాణాలు చేపట్టలేదని పేర్కొన్నారు. దీంతో ఆ స్థలంతోపాటు మరో 4.18 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొందరు షెడ్లు వేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారని తెలిపారు. హైడ్రా రంగంలోకి దిగి 6.18 ఎకరాలను స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేయాలని విన్నవించారు.
అలాగే, దుండిగల్‌లో రెడీమిక్స్ ప్లాంట్ కాలుష్యంపై, కుంట్లూరులో 100 ఎకరాల భూదాన్, ప్రభుత్వ భూముల కబ్జాలపై ఫిర్యాదులు వచ్చాయి. కొల్లూరు భవానీనగర్ లేఅవుట్‌లో పార్కులు, రోడ్ల ఆక్రమణలు, మన్సూరాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలో ఓపెన్ స్పేస్ కబ్జా, నార్సింగి అరుణోదయ సొసైటీలో 14,231 చదరపు గజాల పార్కు స్థలాల అక్రమ రిజిస్ట్రేషన్లపై బాధితులు హైడ్రాను ఆశ్రయించి, రక్షణ కల్పించాలని కోరారు.
