 
                                    హైదరాబాద్ లోని పోచారంలో రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడింది హైడ్రా. శుక్రవారం ( అక్టోబర్ 31 ) స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో 4 వేల గజాల పార్కు స్థలం కబ్జాకు గురైనట్లు హైడ్రకు ఫిర్యాదు చేశారు స్థానికులు. పార్కు స్థలంలో లేఔట్ వేసినవారే కబ్జాకు పాల్పడినట్లు గుర్తించింది హైడ్రా.
స్థానికుల ఫిర్యాదుతో క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి పార్కు స్థలం కబ్జాకు గురైనట్లు నిర్దారించింది.తప్పుడు డాక్యుమెంట్స్ తో ఆముదాల రమేష్ అనే వ్యక్తి 4 వేల గజాలను 800 గజాల చొప్పున 5 ప్లాట్లుగా కులకర్ణి అనే వ్యక్తికి అమ్మినట్లు గుర్తించింది హైడ్రా. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హైడ్రా ఆక్రమణల కూల్చివేతలు చేపట్టింది. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. పార్కు స్థలాన్ని కాపాడినందుకు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు స్థానికులు.
ఇదిలా ఉండగా.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, బాలాపూర్ మండలాల్లో 976 గజాల పార్కుతో పాటు 1.28 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా గురువారం ( అక్టోబర్ 30 ) కాపాడింది. మైలార్దేవుపల్లి విలేజ్లోని శాస్త్రీపురం కాలనీలో 976 గజాల పార్కు స్థలం చుట్టూ గతంలో మున్సిపల్ అధికారులు ఫెన్సింగ్ వేశారు.
తప్పుడు డాక్యుమెంట్లతో కొందరు పార్కు స్థలాన్ని కబ్జా చేస్తున్నారని అక్కడి నివాసితులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన హైడ్రా అధికారులు ఈ స్థలాన్ని కాపాడడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే బాలాపూర్ మండలం జిల్లేలగూడలో సర్వే నంబరు 76లోని 1.28 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను హైడ్రా గురువారం తొలగించింది.
కొంతమంది ఫేక్ పట్టాలు సృష్టించి ఇందులో ప్లాట్లు విక్రయించడంతోపాటు ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందగానే ,ఈ చర్యలు తీసుకుంది. ఈ స్థలాల విలువ రూ. 111 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

 
         
                     
                     
                    