జాతీయ చింతన్ శిబిరానికి హాజరుకండి..మంత్రి వెంకట్ రెడ్డికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆహ్వానం

జాతీయ చింతన్ శిబిరానికి హాజరుకండి..మంత్రి వెంకట్ రెడ్డికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆహ్వానం
  • ఈ నెల 19, 20న ఢిల్లీలో శిబిరం

హైదరాబాద్, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 19, 20న జరిగే జాతీయ చింతన్  శిబిరానికి హాజరు కావాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ విషయాన్ని మంత్రి వెంకట్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రి నితిన్  గడ్కరీ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించనున్నారని ఆయన తెలిపారు.

 మంత్రి వెంకట్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19, 20న ఢిల్లీలో యశోభూమి వేదికగా ఈ శిబిరం నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీ, హైవే అభివృద్ధి, రోడ్డు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. 

జాతీయ చింతన్  శిబిరంలో తెలంగాణ రాష్ట్రం చురుకైన పాత్ర పోషిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ అనుభవాలు, ఉత్తమ విధానాలను ఈ వేదికపై పంచుకుంటామని తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారని మంత్రి వెల్లడించారు.